బీఆర్ఎస్‌కు తప్పని నిరీక్షణ.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా

by Satheesh |   ( Updated:2024-07-30 12:44:57.0  )
బీఆర్ఎస్‌కు తప్పని నిరీక్షణ.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి పదవులకు రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఆగస్టు 1కి వాయిదా వేసింది. కాగా, గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి వేర్వేరు నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే.

అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో వీరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే, స్పీకర్ ఈ పిటిషన్‌పై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ హై కోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ హైకోర్టును కోరింది. తాజాగా, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను ఆగస్ట్ 1కి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed