బిగ్ న్యూస్: మిగిలింది మరో ఐదారు నెలలే.. ఆ హామీ నెరవేరేనా..? రైతుల్లో కొత్త టెన్షన్

by Satheesh |
బిగ్ న్యూస్: మిగిలింది మరో ఐదారు నెలలే.. ఆ హామీ నెరవేరేనా..? రైతుల్లో కొత్త టెన్షన్
X

రుణమాఫీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో జాతీయ రాజకీయాలకు పయనమవుతున్న బీఆర్ఎస్ అధినేత.. సొంత రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీని పూర్తి చేయలేకపోతున్నారు. నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించి.. బడ్జెట్‌లో నిధులు కేటాయించినా.. అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. మొత్తం టార్గెట్ రూ.27,487 కోట్లు కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం మాఫీ చేసింది కేవలం రూ.1,207 కోట్లు మాత్రమే. రానున్న ఐదారు నెలల కాలంలో మిగతా సొమ్మును ప్రభుత్వం రైతులకు అందజేసి హామీని పూర్తి చేస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో జాతీయ రాజకీయాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని గాలికొదిలేశారు. ఇతర రాష్ట్రాల రైతులకు తెలంగాణ ఆదర్శమంటూనే సొంత రాష్ట్రంలో ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించారు. నాలుగు విడతల్లో లక్ష రూపాయల రుణం వరకు రైతులకు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి నాలుగేండ్లు దాటింది. మొదటి విడత రూ. 25 వేల వరకు సక్సెస్‌ఫుల్‌గా అమలైనా.. సెకండ్ ఫేజ్ మాత్రం రూ. 35 వేల దగ్గరే ఆగిపోయింది.

నాలుగేండ్ల కాలంలో మొత్తం రూ.24 వేల కోట్ల పైచిలుకు మాఫీ ఉంటుందని నోటిమాటగా అసెంబ్లీలో 2019 జనవరి 20న కేసీఆర్ చెప్పుకొచ్చారు. స్టేట్ లెవల్ బ్యాంకింగ్ కమిటీ మాత్రం అన్ని బ్యాంకుల నుంచి లెక్కలు తీసి మొత్తం 42,22,928 మంది రైతులకు లక్ష రూపాయల వరకు రుణాలున్నట్లు తేల్చింది. ఇందుకోసం రూ.27,487.36 కోట్లు అవసరమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖకు అందించిన నివేదికలో పేర్కొన్నది.

రూ.35 వేల వరకు మాత్రమే..

ఫస్ట్ ఫేజ్‌గా రూ.25 వేల రుణం వరకు మాఫీ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చి 17న జీవో (నెం. 148) జారీచేసింది. అందులోనే మార్గదర్శకాలనూ పేర్కొన్నది. 2018 డిసెంబరు 11వ తేదీని కటాఫ్ డేట్‌గా ప్రకటించింది. జాతీయ (కమర్షియల్) బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల్లో రైతులకు రూ.25 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని ఆ జీవోలో అప్పటి వ్యవసాయ కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రకారం ఫస్ట్ ఫేజ్‌లో రూ.408.38 కోట్ల మేర రుణమాఫీ డబ్బులు 2,96,571 మంది రైతుల ఖాతాల్లో జమయ్యాయి.

ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2021 జూన్ 6న (ఆవిర్భావ దినోత్సవం తర్వాత) జారీచేసిన మరో జీవో (నెం. 401)లో రూ.50 వేల వరకు రుణమాఫీ చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఆగస్టు 15 నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. ఆ ప్రకారం 2,46,038 మంది రైతులకు రూ.798.99 కోట్ల మేర మాఫీ అమలైంది. దీని వల్ల వివిధ బ్యాంకుల్లో రూ.35 వేల వరకు రుణం ఉన్న రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరింది. ఆ తర్వాత నుంచి రుణమాఫీ స్కీమ్‌కు ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదు.

ఫస్ట్ టర్ములో రూ.లక్ష రుణమాఫీ స్కీమ్‌ను నాలుగు విడతల్లో అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సెకండ్ టర్ములో సైతం అదే పద్ధతిలో అమలుచేయనున్నట్టు సీఎం (2019 జనవరి 20న జరిగిన అసెంబ్లీ సెషన్‌లో) ప్రకటించారు. ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంలో సైతం రుణమాఫీ అమలు గురించి స్పష్టత ఉన్నదని, ఈ హామీ విషయంలో చేతులెత్తేసే ప్రసక్తే లేదని తెలిపారు. కానీ, చివరకు నాలుగేండ్ల కాలం పూర్తయిన తర్వాత రైతులకు మాఫీ అయింది కేవలం రూ.35 వేల వరకు మాత్రమే. మిగిలిన ఆరు నెలల్లో లక్ష రూపాయల మాఫీ హామీని సంపూర్ణంగా అమలు చేయడం ప్రశ్నార్థకంగా మారింది.

తొలి దఫాలో రుణమాఫీ స్కీమ్ ద్వారా ఖర్చుచేసిన రూ.16,144 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 35.31 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఫస్ట్ టర్ములో ఐదేండ్ల పాటు బడ్జెట్‌లో రుణమాఫీ కోసం సర్కారు కేటాయింపులు చేసింది. ఆ ప్రకారమే నిధులను విడుదల చేసింది. స్కీమ్ సంపూర్ణంగా అమలైనట్టు ప్రభుత్వం ప్రకటించి 2018 డిసెంబరు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో అదే హామీని మరోసారి ప్రస్తావించింది.

ఆ ప్రకారం మొత్తం రూ.24 వేల కోట్ల కంటే ఎక్కువగానే నిధులు అవసరమవుతుందని అంచనా వేసి బడ్జెట్‌లో ప్రతి ఏటా కేటాయింపులు చేస్తున్నది. కానీ అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయే తప్ప విడుదల కావడంలేదు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం నాలుగేండ్లలో (బడ్జెట్‌లో) రూ.21,450 కోట్లు కేటాయించినా.. రూ.3,369 కోట్లకు మాత్రమే బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. ఇందులో రూ.1,207 కోట్లే విడుదలయ్యాయి.

ఆరునెలల్లో పూర్తయ్యేనా?

రానున్న ఐదారు నెలల కాలంలో ఇంకా రూ.18,081 కోట్ల మేరకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు రావాల్సి ఉన్నది. నిధులపరంగా చూస్తే రూ.20,243 కోట్లు విడుదల కావాల్సి ఉన్నది. మొత్తం 42.22 లక్షల మంది రైతుల్లో దాదాపు నాలుగున్నరేండ్ల కాలంలో 5.42 లక్షల మంది రైతులు మాత్రమే లబ్ధి పొందగలిగారు. ఇంకా 36 లక్షల మందికంటే ఎక్కువ సంఖ్యలో రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story