వైద్యశాఖలో ప్రక్షాళన షురూ.. వారిని అదనపు బాధ్యతల నుంచి తొలగింపు

by Sathputhe Rajesh |
వైద్యశాఖలో ప్రక్షాళన షురూ..  వారిని అదనపు బాధ్యతల నుంచి తొలగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యశాఖలో ప్రక్షాళన షురూ అయింది. హెచ్​ఓడీలకు అదనపు బాధ్యతలను తొలగిస్తున్నారు. ఒకే అధికారి దగ్గర ఒకటి కంటే ఎక్కువ బాధ్యతలు కలిగి ఉంటే రద్దు చేస్తున్నారు. ఆఫీసర్లపై పనిభారం పడుతుందనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. దీనిలో భాగంగా ఇన్నాళ్లు ఐపీఎం డైరెక్టర్​గా కొనసాగిన డా శంకర్​ కు అదనపు బాధ్యతల పోస్టును రద్డు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు చేసింది.దీంతో ప్రస్తుతం ఆయన కేవలం ఫీవర్ ​ఆసుపత్రి సూపరింటెండెంట్​గానే కొనసాగనున్నారు. డైరెక్టర్ ఆఫ్​పబ్లిక్​హెల్త్​, మెడికల్​ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ , టీవీవీవీపీ విభాగాలన్నీంటిని ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నది. రెండేసీ బాధ్యతలను కలిగి ఉన్న ఆఫీసర్ల పోస్టులను ఒకటికే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నది. ఇక టీవీవీపీలో ప్రస్తుతం పూర్తి స్థాయి కమిషనర్​లేరు. దీంతో ఇంచార్జీగా డీఎంఈ డా రమేష్​రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయనకు గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ గాను పనిచేస్తున్నారు. దీంతో ఒక వ్యక్తి దగ్గరే మూడు పోస్టులు ఉండటం వలన ఆయా విభాగాలను సమర్ధవంతంగా అమలు చేయడం , పర్యవేక్షించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా టీవీవీపీ విభాగం అస్తవ్యస్తంగా మారిపోయిందనే ఆరోపణలు ప్రభుత్వానికి అధికంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు కూడా జిల్లా ఆసుపత్రుల పనితీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇస్తున్నారు. దీంతో టీవీవీపీని ప్రక్షాళన చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్​డా అజయ కుమార్​ను టీవీవీపీ జాయింట్ కమిషనర్​గా నియమించారు.

మిగతా ఆఫీసర్లపై కూడా...

హెల్త్​ డిపార్ట్​మెంట్​ లో రెండేసీ పోస్టులున్న అందరి ఆఫీసర్ల పై సర్కార్​ స్డడీ చేస్తున్నది. రెండేసీ పోస్టులు తీసుకోవాల్సిన అవసరం ఏం ఏర్పడింది? ఆయా విభాగాల పనితీరు ఎలా ఉన్నది? ఆయా పోస్టులకు అర్హులు ఉన్నారా? లోపం ఎక్కడ జరుగుతుంది? అనే వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. అంతేగాక ప్రస్తుతం పనిచేస్తున్న హెచ్ఓడీలపై ఉద్యోగుల పీడ్​ బ్యాక్​ ఎలా ఉన్నది? అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. మరోవైపు కొందరు ఆఫీసర్లు అర్హతలు ఉన్నప్పటికీ హెచ్​ఓడీల పోస్టులు ఇవ్వట్లేదని మెడికల్​ యూనియన్లు ఇటీవల సెక్రటేరియట్​ ముందు ధర్నాలు నిర్వహించి హెల్త్ సెక్రటరికి ఫిర్యాదు చేశారు. కేవలం కొన్ని వర్గాల వారికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నట్లు ఆరోపించారు. దీంతో సర్కార్​ ఈ అంశంపై సీరియస్​గా దృష్టి పెట్టింది.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో...

మెడికల్ ​డిపార్ట్​మెంట్ లో అనేక సమస్యలు ఉన్నాయని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుపడ్డాయి. ముఖ్యంగా డీఎంఈగా ఉన్న వ్యక్తి ఎక్కువ పోస్టులకు బాధ్యతలు నిర్వర్తించడం వలన మిగతా వారికి అవకాశం రావడం లేదని క్వాశ్చన్​ అవర్​ లో కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో స్వయంగా సీఎం సమాధానం ఇస్తూనే ఫైళ్లన్నీ తెప్పించి సమస్యలను పరిష్కరిస్తాను"అని హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో క్లియర్​ చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ సుమారు ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో ఈసారి సెషన్స్​ లో ప్రతిపక్షాలు మళ్లీ ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో హెల్త్​ డిపార్ట్​మెంట్​ను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తున్నది. అయితే ఇప్పటి వరకు మూడు పోస్టులున్న డా రమేష్​రెడ్డికి మాత్రం ఎలాంటి తొలగింపులు లేకపోవడం గమనార్హం. దీంతో ఈ ప్రభుత్వానికి డీఎంఈపై అత్యంత ప్రేమ ఉన్నదని హెల్త్​ డిపార్ట్​మెంట్ లోని పలువురు ఉద్యోగులు గుసగుస లాడుతున్నారు.

Advertisement

Next Story