Jagadish Reddy : సాగునీటి రంగంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం.. : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

by Sathputhe Rajesh |
Jagadish Reddy : సాగునీటి రంగంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం.. : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సాగునీటి రంగంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గత 8 నెలలుగా తెలంగాణలో పాలన పడకేసిందన్నారు. ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు, దాడులు తప్ప మరేమీ లేదన్నారు. మరీ ముఖ్యంగా సాగునీటి రంగంలో ఘోరంగా విఫలమైందన్నారు. గత యాసంగి (రబీ) పంటకు నీళ్లు అందించలేకపోయిందని ఫైర్ అయ్యారు. గతంలో కేసీఆర్ పాలనలో యాసంగిలోనే భారీగా దిగుబడి వచ్చిందని తెలిపారు.

గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు లక్షలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోందని స్పష్టం చేశారు. ఆ నీటిని కాలువల ద్వారా చెరువులు నింపే అవకాశం ఉందని ప్రభుత్వానికి సూచించారు. కానీ ఈ ప్రభుత్వం ఆ పనిచేయడం లేదని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీళ్లు వస్తాయన్న సమాచారం ఉందని తెలిపారు. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో వర్షాభావం కారణంగా కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపాలన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు కూడా ఖాళీగా ఉందని.. ఆ రిజర్వాయర్ సహా దాని కింద ఉన్న చెరువులు నింపాల్సిన అవసరం ఉందన్నారు.

కృష్ణా నది నీటిని కిందికి వదిలి సముద్రం పాలు చేస్తున్నారని.. కాళేశ్వరం మోటర్లతో నీటిని ఎత్తిపోసి సూర్యాపేట వరకు నీటిని తీసుకురావాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చు అని కాంగ్రెస్ నేతలు అన్నారని.. మరి ఎస్సారెస్పీ నుంచి ఎందుకు సూర్యాపేటకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై బద్నాం చేస్తున్నారని. రైతులకు నీళ్లు ఇవ్వలేక నిందను, నెపాన్ని కాళేశ్వరంపైకి నెట్టేస్తున్నారని సీరియస్ అయ్యారు. సుందిళ్ల, అన్నారం ద్వారా ఎల్లంపల్లి నింపాలని కోరారు. తద్వారా వరంగల్, సూర్యాపేటకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story