TG Budget 2024-25: సిక్స్ గ్యారెంటీస్ స్కీంలకు ఎన్ని కోట్లు కేటాయించారంటే..

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-07-25 08:41:21.0  )
TG Budget 2024-25: సిక్స్ గ్యారెంటీస్ స్కీంలకు ఎన్ని కోట్లు కేటాయించారంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సెషన్స్‌లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ సెషన్స్‌ సందర్భంగా అందరి చూపు ఆరు గ్యారెంటీల పథకాలపైనే ఉన్నది. ఏ పథకానికి ఎన్నికోట్లు కేటాయిస్తారు అనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. తాజా బడ్జెట్‌లో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.723 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్లు కేటాయించింది. మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించిన ప్రజలకు ఉచిత కరెంట్ ఇస్తుంది. దీనిలో భాగంగా జులై 15నాటికి 45,81,676 గృహాలకు ఉచిత విద్యుత్​ను అందించారు. దీనికి గాను ఇప్పటి వరకు ప్రభుత్వం విద్యుత్ డిస్కంలకు రూ.585.05 కోట్లు చెల్లించింది. తాజా బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.2,418 కోట్లు కేటాయించింది. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంటగ్యాస్ సిలిండర్​ను అందిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు 39,57,637కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీం కోసం ఇప్పటికే రూ.200 కోట్లు చెల్లించిన ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.723 కోట్లు కేటాయించింది.

ఇందిరమ్మ ఇల్లు పథకం కింద..

ఇక ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇండ్లు కట్టుకోవాలనుకునే పేదలకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజవర్గంలో కనీసం 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇండ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఆర్, సీసీ కప్పుతో వంటగది, టాయిలెట్ సౌకర్యం ఉంటాయని తెలిపింది. రెండు పడక గదుల ఇండ్ల పథకం కింద పూర్తయిన ఇండ్లను త్వరలోనే కేటాయిస్తామని ప్రకటించింది.

Advertisement

Next Story