ఎక్స్టెన్షన్ కొవిడ్ గ్రూపుల కాంట్రాక్టు పొడిగింపు

by Javid Pasha |
ఎక్స్టెన్షన్ కొవిడ్ గ్రూపుల కాంట్రాక్టు పొడిగింపు
X

దిశ, సిటీ బ్యూరో : కరోనా మహమ్మారి ప్రబలినపుడు మహానగరంలోని వీఐపీ జోన్‌లో రసాయనాలను పిచికారీ చేసేందుకు నియమించిన కొవిడ్ గ్రూప్‌ల కాంట్రాక్టును జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఎక్స్‌టెన్షన్ చేశారు. కరోనా కష్టసమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ కెమికల్ స్ప్రే చేసిన కొవిడ్ గ్రూప్‌లోని 220 మంది కార్మికులను రోడ్డున పడేయొద్దన్న ఉన్నతాధికారుల మంచి సంకల్పం కొందరు అక్రమార్కులకు పండుగగా మారింది. గత మార్చి నెలాఖరుకు కాంట్రాక్ట్ గడువు ముగియటంతో ఈ గ్రూప్‌ల కాంట్రాక్టును మరో ఆరు నెలలు కొనసాగించేందుకు వీలుగా ఉన్నతాధికారులు ఎక్స్‌టెన్షన్ ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం. ఇప్పుడు కరోనా మహమ్మారి పెద్దగా లేకపొవటంతో వీరంత జోనల్ ఎంటమాలజిస్టుల పరిధిలోనే విధులు నిర్వహిస్తున్నందున ఈ 220 మంది కార్మికులను ఎంటమాలజీలో విలీనం చేసి, వీరిచే దోమల నివారణ విధులు చేయించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం కార్మికుల్లో ప్రతి ఏడుగురితో ఒక గ్రూప్‌ను తయారు చేసేందుకు ఎంటమాలజీ విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పెరగనున్న శ్రమదోపిడీ

కొవిడ్ గ్రూప్‌లో పని చేస్తున్న ఒక్కో కార్మికుడికి ప్రస్తుతం డైలీ రూ.600 చెల్లించాల్సి ఉండగా, వీరి పనితీరును పర్యవేక్షిస్తున్న జోన్లవారీగా ఉన్న సీనియర్ ఎంటమాలజిస్టులు, వారి కింద పని చేసే అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు కార్మికులకు డైలీ రూ.300 నుంచి రూ.400 వరకు మాత్రమే చెల్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో కార్మికుడికి వారానికో వారంతపు సెలవునిచ్చి నెలకు రూ.18 వేలు జీతంగా నిర్ణయించి, అందులో ఈఎస్ఐ, పీఎఫ్ కట్ చేసుకోవాలన్న నిబంధనను కూడా అమలు చేయటం లేదని సమాచారం. ముఖ్యంగా కార్మికులకు వారి జీతాలను బ్యాంకు ఖాతాలా ద్వారా చెల్లించాలన్న ప్రధాన నిబంధనకు నీళ్లొదిలిన అధికారులు, వారికి మ్యానువెల్‌గా జీతాలు చెల్లిస్తున్నట్లు, ఈ విషయం బయటకు చెబితే కఠిన చర్యలుంటాయని బెదిరిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed