ధాన్యం కొనుగోలులో ఆలస్యంపై అన్నదాతల ఆగ్రహం

by Javid Pasha |
ధాన్యం కొనుగోలులో ఆలస్యంపై అన్నదాతల ఆగ్రహం
X

దిశ, జగదేవపూర్: ధాన్యం కొనుగోలులో ఆలస్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన ధాన్యం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఉండడంతో మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి తడిసిముద్దయ్యాయి. దీంతో ఆగ్రహించిన రైతులు పలు మండలాల్లో రహదారులపై ధర్నా, రాస్తారోకో చేశారు. కొన్ని చోట్ల ధాన్యం బస్తాకు నిప్పంటించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కేంద్రాలు ప్రారంభించి సుమారు నెలరోజులవుతున్నా ధాన్యం మాత్రం కేంద్రాల వద్దే ఉంటుందని అన్నారు. గన్నీ బ్యాగుల కొరత వేధిస్తుండగా మరోవైపు కాంటా పెట్టిన బస్తాలను లారీల్లో తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. దీంతో వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యానికి మొలకలు వస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్​ చేశారు. రైతుల ధర్నాకు ప్రతిపక్ష పార్టీలు మద్దు తెలిపాయి.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడంతో రైతులు గంటకు పైగా ధర్నా చేపట్టారు. ఉన్నత స్థాయి అధికారులు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. దీంతో ఆగ్రహించిన రైతులు తడిసిన ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలంలోని మునిగడప రైతులు రోడ్డుపై గంటకు పైగా ధర్నా చేపట్టారు. మునిగడపలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. కేంద్రాలు ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.

ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే కొనుగోలు కేంద్రంలో వారం రోజులుగా గన్నీ సంచులు కొరత, మరోవైపు తూకం వేసిన ధాన్యాన్ని తీసుకవెళ్లడానికి లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం బస్తాలు నిలిచిపోతున్నాయి. ఇప్పటి వరకు కేవలం మూడు వేల ధాన్యం బస్తాలను మాత్రమే తరలించారు. నత్త నడకన ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగుతుంటే అధికారులు, నాయకులు మాత్రం కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు వాపోతున్నారు. మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఐకేపీ ఏపీఎం ఆనంద్ వచ్చేవరకు ధర్నాను విరమించేది లేదంటూ రోడ్డుపై భీష్మించుకొని కూర్చున్నారు. రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న ఎస్ఐ.కృష్ణమూర్తి ఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.

చేగుంటలో..

దిశ, చేగుంట: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలను తరలించాలని కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేగుంట మండలంలోని వడియారం కొనుగోలు కేంద్రం ఎదుట రహదారిపై రైతులతో కలిసి బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేరవేసి నెల రోజులు గడుస్తున్నా కనీసం లారీల్లో నింపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, రైతులకు ఇబ్బంది గురి చేస్తున్నారని విమర్శించారు. వెంటనే లారీలను ఏర్పాటు చేసి రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్​ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి హరీశ్​ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గంట పాటు బైఠాయించారు. పోలీసులు చేరుకొని శ్రవణ్ కుమార్ రెడ్డి తో మాట్లాడి రైతులకు ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం తరలింపు కోసం లారీలు ఏర్పాటు చేయడానికి కృషి చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లోగా పూర్తి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్ లోకి చేరాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ రహదారిపై రాస్తారోకో కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ రెడ్డి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంట రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్, రాములు తోపాటు వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గుమ్మడిదలలో..

దిశ, గుమ్మడిదల : మండల కేంద్రంలోని నేషనల్ హైవే టోల్ ప్లాజా వద్ద రైతులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 25 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలకు వడ్లు తడిచి మొలకలు వస్తున్నాయని, తడిచిన ధాన్యాన్ని కొంటానని ప్రకటించిన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని అన్నారు. రైతులకు మద్దతుగా మండల కాంగ్రెస్ నాయకులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ధర్నా నిర్వహిస్తున్న రైతులు, పార్టీ నాయకులను పోలీసులు, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని నచ్చజెపి ధర్నా విరమింపజేశారు.

జోగిపేటలో లారీలను అడ్డుకున్న రైతులు

దిశ, అందోల్ : అకాల వర్షాలతో రైతులు పండించిన ధాన్యం బస్తాలు తడిసిపోతున్నాయని, రోజుల తరబడి ధాన్యాన్ని తీసుకేళ్లేందుకు లారీ కోసం ఎదురు చూడాల్సి వస్తుందని, ధాన్యాన్ని వెంటనే రైస్‌ మిల్లులకు తరలించాలని నిరసిస్తూ రైతుల జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మంగళవారం అందోలు సోసైటీ కార్యాలయం ఎదుట జోగిపేటలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వేర్వురుగా రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. సుమారుగా గంటకు పైగా జాతీయ రహదారిపై భైఠాయించడంతో, ఇరుపక్కల వాహనాలను ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి తూకం వేయడం లేదని, తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తీసుకెళ్లడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం తూకం వేసి 10 రోజులు గడుస్తున్నప్పటికీ లారీలను కేంద్రాలకు పంపకపోవడంతో ధాన్యం కోసం రేయింబవళ్లు కాపలాగా ఉండాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక బస్తా బరువు 41.300 కిలోలు ఉంచాలని, ఇందులో నుంచి తూకంగా కిలో 300 గ్రాముల ధాన్యాన్ని తరుగు తీయాలని ఉంది. కానీ ఇందుకు విరుద్దంగా తరుగు పేరిట కొనుగోలు కేంద్రాలలో బస్తాకు 2.50 కిలోల తరుగును తీస్తున్నారని తెలిపారు. క్వింటాలుకు 6 కిలోల తరుగు తీస్తున్నారన్నారు. ధర్నాకు కాంగ్రెస్‌ నాయకులు డీజీ వెంకటేశం, గోహెర్‌ అలీ, సీపీఎం నాయకుడు విద్యాసాగర్‌ మద్దతు తెలిపారు.

అందోలులో ధాన్యం తగులబెట్టిన రైతులు

రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం, తూకంలో జాప్యం చేయడం, రైస్‌ మిల్లులకు పంపించడంలో నిర్లక్ష్యం వహించడంతో విసుగు చెందిన అన్నదాతలు ధాన్యాన్ని జాతీయ రహదారిపై తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జోగిపేట ఎస్‌ఐ సామ్యానాయక్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి తహశీల్దార్‌కు ఫోన్‌లో మాట్లాడి లారీలను త్వరగా కేంద్రాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో రైతుల ధర్నాను విరమించడంతో ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

రాజీవ్ రహదారిపై రైతుల ధర్నా

దిశ, చిన్నకోడూర్ : ప్రభుత్వం తమ ధాన్యాన్ని సకాలంలో కొనడం లేదని మంగళవారం మండలంలోని రామునిపట్ల గ్రామ రైతులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు సెంటర్లలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో కొనుగోలు చేపట్టడం లేదని, అకాల వర్షాలకు తాము పండించిన పంట పూర్తిగా తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరగా వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ రహదారిపై రైతులు సుమారుగా గంటకు పైగా రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్​ కు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి చిన్నకోడూరు తహశీల్దార్​జయలక్ష్మి, ఎస్ఐ శివానందం చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.

Advertisement

Next Story