‘కాళేశ్వరం’ ఎంపికలోనే లోపం.. విధాన నిర్ణయాలపై కమిషన్ ఫోకస్

by Rajesh |
‘కాళేశ్వరం’ ఎంపికలోనే లోపం.. విధాన నిర్ణయాలపై కమిషన్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు, అమలుకు సంబంధించిన ఆదేశాలు, నిధుల కేటాయింపు తదితర పలు అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. మాజీ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నది. గతంలో చీఫ్ సెక్రెటరీలుగా వ్యవహరించిన రాజీవ్‌శర్మ, ఎస్పీ సింగ్, ప్రదీప్‌చంద్ర తదితరులను కూడా ఎంక్వయిరీకి రావాల్సిందిగా కోరనున్నది. ఇప్పటికే మాజీ సీఎస్‌లు సోమేశ్‌కుమార్ ఫిజికల్‌గా కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. మరో మాజీ సీఎస్ ఎస్కే జోషి అనారోగ్యం కారణంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా అటెండ్ అయ్యారు. వీరిద్దరూ చీఫ్ సెక్రెటరీలుగా, ఇరిగేషన్ కార్యదర్శులుగా పనిచేశారు. అప్పటి పాలసీలు, చర్చలపై వివరించారు. అఫిడవిట్లను కూడా త్వరలో సమర్పించనున్నారు.

రామకృష్ణారావుకు ఆగస్టు 5 వరకు వెసులుబాటు

ఇదే అంశానికి సంబంధించి పలువులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా కమిషన్ ముందు సోమవారం హాజరయ్యారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న వికాస్‌రాజ్, రామకృష్ణారావు, స్మితా సభర్వాల్ సహా రిటైర్ అయిన ఐఏఎస్‌లు రజత్ కుమార్ కొన్ని వివరణలు ఇచ్చారు. అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. బడ్జెట్ సమావేశాలు ఉన్నందున గడువు ఇవ్వాలన్న రామకృష్ణారావు విజ్ఞప్తి మేరకు ఆగస్టు 5 లోగా సమర్పించేందుకు వెసులుబాబు కల్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏ స్థాయిలో నిర్ణయాలు జరిగాయి, నిధుల కేటాయింపునకు అనుసరించిన విధానం, కాంట్రాక్టర్లకు జరిగిన పేమెంట్స్, ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు, ద్రవ్య సంస్థల నుంచి సమకూర్చుకున్న రుణాలు తదితర అంశాలను అఫిడవిట్లలో పొందుపర్చాల్సిందిగా వీరిని కమిషన్ ఆదేశించింది.

మేడిగడ్డ సైట్ ఎంపికలోనే లోపాలు

ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం లభించిందని, నిధులు కూడా రిలీజ్ అయ్యాయని, పనులు కూడా ఒక మేరకు పూర్తయ్యాయని వివరించిన విద్యుత్ ఇంజినీర్ (విద్యుత్ జేఏసీ ప్రతినిధి) కంచర్ల రఘు..గత ప్రభుత్వం మేడిగడ్డను కాళేశ్వరం ప్రాజెక్టుకు సరైన ప్రాంతంగా ఎంపిక చేసిన నిర్ణయంలోనే లోపమున్నదన్నారు. ఉమ్మడి ప్రభుత్వం తుమ్మడిహెట్టిని ఎంపిక చేసిందని, కానీ గత సర్కారు మాత్రం మేడిగడ్డను ఎంపిక చేయడం ద్వారా ఖర్చు భారీగా పెరగిందని, ఆయకట్టు రెండు లక్షల ఎకరాలు తగ్గిందని చెప్పారు. మూడు బ్యారేజీల అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు సోమవారం హాజరైన రఘు... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించారు. ప్రాజెక్టు సైట్ మార్పు కారణంగా రాష్ట్ర ఖజానాపై భారం పడిందని, ఏటా నిర్వహణకయ్యే ఖర్చు కూడా పెరిగిందని పేర్కొన్నారు.

మూడు బ్యారేజీల నిర్మాణంలోని నాణ్యతతో పాటు వీటికి అనుసంధానంగా నిర్మించిన పంప్‌హౌజ్‌లు మునిగిపోవడానికి దారితీసిన కారణాలను కూడా కమిషన్‌కు వివరించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఒక్క ఎకరం కూడా ఆయకట్టు లేదని, కానీ తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మిస్తే రెండు లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు సాధ్యమయ్యేదని పేర్కొన్నారు. టెండర్లను ఖరారు చేసిన తర్వాత అంచనా వ్యయం పెరిగిందని, మేడిగడ్డ దగ్గర అప్రోచ్ రోడ్డు కోసం రూ. 66 కోట్లను నిర్మాణ సంస్థ అదనంగా తీసుకున్నా ప్రభుత్వం దాన్ని ప్రశ్నించలేదని గుర్తుచేశారు.

ఫలితంగా ప్రజాధనం దుబారా అయిందని, టెండరు నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టు కంపెనీలకు పేమెంట్స్ జరిగాయన్నారు. ఈపీసీ ఒప్పందం ప్రకారం నిర్మాణ ప్రక్రియ జరగలేదని, లోపాలు చాలా ఉన్నాయని చెప్పారు. దీనికి తోడు మూడు బ్యారేజీలను నిర్మించిన తర్వాత నుంచి ఇప్పటివరకు మెయింటెనెన్స్ చేపట్టలేదని, రిపేర్లకు అదే కారణమని వెల్లడించారు. పంప్‌హౌజ్‌ల విషయంలో నీటి మట్టం లెక్కలపై నిర్మాణ కంపెనీలు నిర్లక్ష్యం వహించాయని, ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోలేదన్నారు. నది మట్టం కంటే దిగువన నిర్మించినందున 2022 జూలైలో వచ్చిన వరదలతో కన్నేపల్లి పంప్‌హౌజ్ మునిగిపోయిందని పేర్కొన్నారు.

నేడు హాజరుకానున్న కేంద్ర సలహాదారు

ప్రాణహిత-చేవెళ్లను కాదని కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసే ఆలోచనలోనే తప్పిదం ఉన్నదంటూ గతంలో వ్యాఖ్యానించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ మంగళవారం కమిషన్ ముందు హాజరుకానున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కాళేశ్వరం లోపాలను, మూడు బ్యారేజీల్లోని తప్పులను వివరించనున్నారు. డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, క్వాలిటీ, సాయిల్ టెస్టింగ్, కేంద్రం నుంచి వచ్చిన అనుమతులు..తదితర అనేక అంశాలపై కమిషన్‌కు ఆధారాలతో సహా వివరించనున్నారు.

Advertisement

Next Story