Lok Sabha Elections-2024 : అధికారి కాళ్లు పట్టుకున్న ఎంపీ అభ్యర్థి.. అయినా కనికరించలే..

by Nagaya |   ( Updated:2024-04-25 14:54:39.0  )
Lok Sabha Elections-2024 : అధికారి కాళ్లు పట్టుకున్న ఎంపీ అభ్యర్థి.. అయినా కనికరించలే..
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధన ఎన్నో జీవితాలను తలక్రిందులను చేసిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు, టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ సమయంలోనూ ఈ నిబంధనను విధించి విద్యార్థుల చావులకు కారణం అయిన సందర్భాలు ఉన్నాయి. ఏడాదంతా చదివి పరీక్షకు వెళ్తే.. బస్సు ఆలస్యమో.. అడ్రస్ సరిగ్గా తెలియకనో ఎగ్జామ్‌ హాల్‌కు నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని గేటు బయటే ఆపేసి తిప్పిపంపేవారు. దీని వల్ల ఆ విద్యా సంవత్సరం అంతా వృథా అయిపోయేది. ఇప్పుడు అదే పరిస్థితి ఓ రాజకీయ నేతకు ఎదురైంది. మళ్లీ ఐదేళ్ల వరకు ఆయనకు నామినేషన్ వేసే పరిస్థితి లేకుండా పోయింది.

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య గురువారం పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడానికి వెళ్లాడు. కానీ అప్పటికే ఆలస్యం అయింది. నిమిషం ఆలస్యం అయినా నామినేషన్‌ వేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించదు. దీంతో మాతంగి హనుమయ్యను పోలీసులు గేటు బయటే ఆపేశారు. తనను నామినేషన్ వేసేందుకు అనుమతించాలని అక్కడే ఉన్న ఎన్నికల అధికారి కాళ్లు మొక్కి అడిగినా మాతంగి హనుమయ్యను లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరోవైపు ‘ఇప్పుడు తెలిసిందా ఒక్క నిమిషం ఆలస్యం విలువ..’ ‘రాజకీయ నాయకులు తీసుకువచ్చిన ఈ నిబంధన ఎంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుందో అర్థం అయిందా..?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Click here for Twitter video

Advertisement

Next Story

Most Viewed