డేటా చౌర్యం కేసులో.. మొత్తం సమాచారాన్ని క్లౌడ్‌లో భద్రపరిచినట్టుగా తెలుస్తోంది!

by Vinod kumar |
డేటా చౌర్యం కేసులో.. మొత్తం సమాచారాన్ని క్లౌడ్‌లో భద్రపరిచినట్టుగా తెలుస్తోంది!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: డేటా చౌర్యం కేసులో నిందితులు మొత్తం సమాచారాన్ని క్లౌడ్ లో భద్రపరిచినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులను విచారిస్తున్న సైబరాబాద్ సిట్​అధికారులు వివరాలు అందచేయాల్సిందిగా గూగుల్​కు లేఖ రాసినట్టు సమాచారం. వీరి నుంచి సమాచారం వచ్చిన తరువాత గూగుల్, యాహూ ఇలా వేర్వేరు మెయిళ్ల సంస్థలకు లేఖలు రాసి వివరాలు తెప్పించుకుంటే డేటాను ఎవరు లీక్​చేశారన్నది బయటపడుతుందని ఓ దర్యాప్త అధికారి వివరించారు. కాగా, ఈ కేసులపై సీరియస్​గా దృష్టి పెట్టిన కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖ అధికారులు మంగళవారం సిట్​అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడినట్టు సమాచారం. దర్యాప్తులో ఇప్పటివరకు వెల్లడైన వివరాల గురించి అడిగినట్టు తెలిసింది.

కొన్ని రోజుల తేడాలోనే సైబరాబాద్ పోలీసులు దాదాపు 83 కోట్ల మందికి సంబంధించిన ఓ గ్యాంగుతోపాటు వినయ్​భరద్వాజ్​అనే వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న డేటాలో ఆర్మీ, నేవీ అధికారులు, సిబ్బందితోపాటు పలు కీలక ప్రభుత్వ శాఖల ఉద్యోగుల డేటా ఉండటం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఆర్మీ, నేవీలకు చెందిన ఇంటెలిజెన్స్​వింగ్​ల సిబ్బంది కూడా రంగంలోకి దిగాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డేటా చౌర్యం కేసులపై సీరియస్​గా దృష్టిని కేంద్రీకరించింది. దాంతో సిట్​అధికారులు కూడా విచారణను ముమ్మరంగా జరుపుతున్నారు. ఓ అధికారితో మాట్లాడినపుడు టెక్నికల్​గా ఈ కేసును విచారించాల్సి ఉంటుంది కాబట్టి దర్యాప్తు ఆలస్యమవుతుందని చెప్పారు. ఇప్పటివరకు డేటాను ఎవరు లీక్​చేశారన్న దానిపై తమకు కొంత స్పష్టత వచ్చిందని చెప్పారు. గూగుల్​రిప్లయ్​కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.

ఇప్పటివరకు 21 కంపెనీలకు నోటీసులు జారీ చేయగా ఎనిమిది కంపెనీల ప్రతినిధులు విచారణకు హాజరైనట్టు చెప్పారు. బిగ్​బాస్కెట్​సంస్థ ప్రతినిధులు తమ డేటా చోరీ అయినట్టు ఒప్పుకున్నారని తెలిపారు. 2020లో బెంగళూరులో కూడా తమ సంస్థకు చెందిన డేటా లీకైందని, కేసులు కూడా నమోదయ్యాయని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారన్నారు. దర్యాప్తులో బిగ్​బాస్కెట్​నుంచి 3కోట్ల మంది డేటా చౌర్యానికి గురైనట్టుగా వెల్లడైందని వివరించారు. పాలసీ బజార్​నుంచి కూడా డేటా చోరీ అయినట్టు తమ విచారణలో ఆధారాలు లభించాయన్నారు. అయితే, ఆ సంస్థ ప్రతినిధులు దీనిని అంగీకరించటం లేదన్నారు. బిగ్​బాస్కెట్, పాలసీబజార్ సంస్థలకు చెందిన సర్వర్లు హ్యాక్​అయ్యాయని తమ దర్యాప్తులో స్పష్టమైందన్నారు.

ఈ డేటా రీస్టోర్​అయ్యిందని చెప్పారు. అయితే, ఈ డేటా బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందా? వెళితే ఎలా వెళ్లింది? అన్నది నిర్ధారించుకోవాల్సి ఉందని తెలిపారు. హెచ్డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన డేటా చోరీ అయ్యిందని చెప్పారు. చోరీ చేస్తున్న డేటాను అడ్వర్టయిజ్​మెంట్, మార్కెటింగ్ తోపాటు సైబర్​మోసాలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు ఆ అధికారి చెప్పారు. నిందితుల నుంచి ఇప్పటివరకు మొత్తం ఇరవైఏడు మంది డేటాను కొన్నట్టు విచారణలో తేలిందన్నారు. మల్టీ నేషనల్​కంపెనీలు కూడా నిందితుల నుంచి డేటాను కొంటున్నట్టుగా విచారణలో తెలిసిందన్నారు. ఇలా కొన్న డేటాను ఎక్కువగా బల్క్​ఎస్సెమ్మెస్​లు పంపేందుకు వాడుతున్నట్టు వివరించారు.

ఇది చాలా పెద్ద బిజినెస్​అని చెప్పారు. నిబంధనల ప్రకారం.. బల్క్​ ఎస్సెమ్మెస్ ​ప్రొవైడర్లు ట్రాయ్ ​నుంచి లైసెన్స్ ​తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. చాలామంది లైసెన్సులు తీసుకుంటున్నారని చెబుతూ.. వీటిపై ట్రాయ్​ పర్యవేక్షణ సరిగ్గా ఉండటం లేదని చెప్పారు. విచారణలో ఒక్క ఎస్సెమ్మెస్​ ప్రొవైడర్​ రోజుకు దేశవ్యాప్తంగా మూడు కోట్ల మెసేజీలు పంపుతున్నట్టు తేలిందన్నారు. ఒక్కో మెసేజీకి తొమ్మది నుంచి పధ్నాలుగు పైసల వరకు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆయా బ్యాంకులు రుణాల రికవరీ బాధ్యతలను థర్డ్​పార్టీలకు ఇస్తున్నాయని, వీరి నుంచి కూడా డేటా లీక్​అవుతోందన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద 126 సర్వీస్​ప్రొవైడర్లు ఉన్నట్టు చెప్పారు. తాజాగా పట్టుబడ్డ వినయ్​భరద్వాజ్​నలుగురికి డేటాను విక్రయించినట్టుగా విచారణలో వెల్లడైందని చెప్పారు.

Advertisement

Next Story