CM రేవంత్ రెడ్డిలో ఆ భయం మొదలైంది.. తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
CM రేవంత్ రెడ్డిలో ఆ భయం మొదలైంది.. తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణ(SC Classification)పై హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 100 రోజుల్లో వర్గీకరణ అమలు చేస్తామని మాటిచ్చిన ప్రధాని మోడీ(PM Modi) కూడా.. ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని అన్నారు. తెలంగాణలో వర్గీకరణకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కొప్పుల రాజు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పదవి ఊడుతుందనే భయం సీఎం రేవంత్ రెడ్డిలో మొదలైందని రాజయ్య ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. మాలల ఒత్తిడికి తలొగ్గుతున్నారంటూ ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి అంతుకూడా చూస్తానని వార్నింగ్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైపోయిందని విమర్శలు చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్‌ ఓటమి ఖాయం.. కేసీఆర్‌ సీఎం అవడం గ్యారంటీ అని అన్నారు.

కాగా, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు (Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. అంతేకాదు.. వర్గీకరణపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని స్పష్టం చేసింది. కాగా.. ఈ వర్గీకరణను మెజారిటీ సభ్యులు సమర్థించగా.. జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకించారు. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం ఉందని.. వర్గీకరణచేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ తీర్పును అనుసరించి తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలకు న్యాయస్థానం సూచించింది.

Next Story

Most Viewed