TGSRTC: ప్రయాణికుడికి సీపీఆర్ చేసి కాపాడిన సిబ్బంది.. సత్కరించిన ఆర్టీసీ యాజమాన్యం

by Ramesh Goud |
TGSRTC: ప్రయాణికుడికి సీపీఆర్ చేసి కాపాడిన సిబ్బంది.. సత్కరించిన ఆర్టీసీ యాజమాన్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బ‌స్సులో గుండెపోటు వ‌చ్చిన ప్రయాణికుడికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి త‌ర‌లించిన ఆర్టీసీ సిబ్బందిని యాజ‌మాన్యం అభినందించింది. ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వారిని సత్కరించి, బహుమతులు అందజేశారు. జీడిమెట్ల డిపోన‌కు బ‌స్సులో శుక్రవారం ముర‌ళికృష్ణ అనే ప్రయాణికుడికి గుండెపోటు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని గమణించిన కండ‌క్టర్ అంజ‌లి.. డ్రైవ‌ర్ సైదులును అప్రమ‌త్తం చేసి బ‌స్సును ఆపించారు. వెంట‌నే 108 కాల్ చేసి, మరో ప్రయాణికుడి సాయంతో బస్సులోనే ముర‌ళికృష్ణకు సీపీఆర్ చేశారు. అనంతరం ఆయ‌న‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి త‌ర‌లించారు.

దీనిపై సమాచారం అందుకున్న సజ్జనార్.. జీడిమెట్ల డిపోన‌కు చెందిన కండ‌క్టర్ అంజ‌లి, డ్రైవ‌ర్ సైదులును హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌కు పిలిపించి, ఘ‌నంగా స‌న్మానించారు. అంతేగాక సమయస్పూర్తితో వ్యవహారించి.. ప్రయాణికుడికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి త‌ర‌లించినందుకు వారిని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో సేవా తర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖ‌ర్, చీఫ్ ప‌ర్సన‌ల్ మేనేజ‌ర్ ఉషాదేవి, జీడిమెట్ల డిపో మేనేజ‌ర్ అంజ‌నేయులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed