Ponguleti: కేటీఆర్ నిరూపించు లేదా రాజీనామా చేయ్.. మంత్రి పొంగులేటి ఫైర్

by Prasad Jukanti |   ( Updated:2024-09-21 14:10:46.0  )
Ponguleti: కేటీఆర్ నిరూపించు లేదా రాజీనామా చేయ్.. మంత్రి పొంగులేటి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్‌‌రెడ్డి రూ.8,888 కోట్ల అమృత్‌ టెండర్ల కుంభకోణానికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇవాళ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కేవలం రూ.3,516 కోట్ల పనులకే టెండర్లు పిలిస్తే రూ.8,888 కోట్ల అవినీతి ఎక్కడి నుంచి వచ్చిందని మండిపడ్డారు. అవినీతిని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రిజైన్ చేస్తానని, కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే రూ.3,616 కోట్ల చొప్పున 3 ప్యాకేజీలుగా పిలిచి అసెంబ్లీ పోలింగ్ తేదీకి ఒక్క రోజు ముందే హడావిడిగా ఈ టెండర్లను కట్టబెట్టిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈసీ అనుమతి లేకుండా ప్రైస్ బిడ్‌లు ఓపెన్ చేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ అక్రమ టెండర్ల గురించి ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. దీంతో ఈ టెండర్లు అగ్రిమెంట్ చేసి ఉండకపోతే వెంటనే క్యాన్సిల్ చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారని వెల్లడించారు. ఆ తర్వాత పాత ఎస్ఎస్ఆర్‌తోనే మళ్లీ టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారని వివరించారు.

సృజన్‌రెడ్డి మీకే దగ్గరి బంధువు

మళ్లీ పిలిచిన టెండర్లలో సోదా కంపెనీ సృజన్‌రెడ్డి ఒకటి దక్కిచుకున్నారని పొంగులేటి చెప్పారు. ఈ సోదా కంపెనీ రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డిదని కేటీఆర్ అంటున్నారని, కానీ సృజన్‌రెడ్డి నాపై పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డికి సొంత అల్లుడని తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్ఎస్‌లో చేరినందుకు ఉపేందర్‌రెడ్డి అల్లుడికి చెందిన సోదా కంపెనీకి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని ప్యాకేజీ నంబర్ 7కు సంబంధించిన రూ.2,300 కోట్ల విలువ చేసే టన్నెల్ వర్క్‌లో రూ.1,100 కోట్ల వర్క్‌ను అఫీషియల్‌గా అప్పగించిందని ఆరోపించారు.

విమర్శ చేస్తే పస ఉండాలి

ఈ మూడు వర్క్‌ల టెండర్ల వాల్యూ ఇప్పుడు రూ.3,687 కోట్లు అని పొంగులేటి తెలిపారు. ఆనాడు వాళ్లు టెండర్లు పిలిచినప్పుడు రూ.3,744 కోట్లు అన్నారని, మేం పిలిచిన రీటెండర్లలో గతం కంటే రూ.54 కోట్ల తక్కువకే బిడ్లు వచ్చాయన్నారు. గత ప్రభుత్వం టెండర్ కంటే ఒక్క రూపాయి కూడా పెరగలేదనే విషయాన్ని కేటీఆర్ గమనించకపోవడం బాధాకరం అన్నారు. ఏదైనా విమర్శ చేస్తే పస ఉండాలని.. కానీ బట్ట కాల్చి మీద వేస్తామంటే ఆ మంటల్లో వారే కాలిపోతారని వార్నింగ్ ఇచ్చారు. విమర్శలకు ఓ హద్దు ఉండాలని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed