TGS RTC: ఆర్టీసీ డెడ్‌లైన్ @ ఫిబ్రవరి 9.. సర్కార్ ప్రకటన కోసం వెయిటింగ్

by Shiva |
TGS RTC: ఆర్టీసీ డెడ్‌లైన్ @ ఫిబ్రవరి 9.. సర్కార్ ప్రకటన కోసం వెయిటింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం తరహాలో తప్పించుకోకుండా తమ జీవితాలకు భద్రత కల్పించాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాలు కోరుతున్నారు. వారం రోజుల క్రితం యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించారు. ఈ నెల 9వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తామని అప్పటిలోగా డిమాండ్లు అమలు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కానీ ఇప్పటివరకు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సమ్మెకు సైరన్ ​మోగించేందుకు కార్మిక నేతలు ప్లాన్ ​చేస్తున్నట్టు తెలిస్తోంది. ఆర్టీసీ విలీనం, 2021 జీత భత్యాల సవరణ, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రత, ఎలక్ట్రిక్​ బస్సులను ప్రభుత్వం ఆర్టీసీకి కొనుగోలు చేసి ఇచ్చి సంస్థను కాపాడాలని సూచిస్తున్నారు. యూనియన్ ​నేతలు 21 డిమాండ్లను ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం ముందుంచారు.

కొత్త బస్సుల కొనుగోలు

కొత్త బస్సుల కొనుగోలు ద్వారా ఆర్టీసీని అభివృద్ధి పరిచి, ఆధునీకరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు కోరారు. సంస్థ అప్పులను ప్రభుత్వమే టేకోవర్ చేసి, సంస్థ అభివృద్ధికి ప్రతియేటా బడ్జెట్లో 3 శాతం కేటాయించాలని పేర్కొన్నారు. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం వాడుకున్న సీసీఎస్, ఎస్ఆర్బీఎస్, పీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. సీసీఎస్​లో ఎన్నికలు నిర్వహించి, ఆఫీసు సిబ్బంది ఖాళీలను భర్తీ చేపట్టాలని సూచించారు. మహాలక్ష్మి పథకంలో జీరో టికెట్ బదులు మహిళలకు స్మార్ట్ కార్డుతో పాటు, రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. బెడ్ ​విన్నర్​, మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే ఉద్యోగాలు రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలన్నారు. ప్రస్తుతం కన్సాలిడేటెడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. జీవో నం 30 ప్రకారం వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచాలని పేర్కొన్నారు.

తార్నాక ఆసుపత్రిని మెరుగుపర్చాలి

తార్నాక ఆసుపత్రిలో అన్ని విభాగాలలో సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని కోరారు. రోగులు, వారి వెంట వస్తున్న అటెండెంట్లకు భోజన, వసతి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ఆర్టీసి ఉద్యోగులకు తార్నాక హాస్పిటల్లో మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో ఉద్యోగి ఫ్యామిలీతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సరిపడా మందులు సరఫరా చేయాలన్నారు. అకౌంట్స్ విభాగంలో సెంట్రలైజేషన్ విధానం రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు.

కనీస వసతులు కల్పించాలి

అన్ని యూనిట్లలో మహిళలతో పాటు పురుషులకు కూడా అన్ని వసతులతో పాటు త్రాగునీరు, వాహనాల పార్కింగ్ కు సరిపడ షెడ్స్ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అక్రమ సస్పెన్షన్, రిమూవల్ అయినవారిని, అప్పీల్ రిజెక్ట్ అయినవారిని విధులలోకి తీసుకోవాలని కోరారు. 2019 సమ్మెకాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీస్ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికి నెలకు 3 రోజులు సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Next Story