TG Govt.: సెప్టెంబరు 17న ప్రజాపాలన దినోత్సవం.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

by Shiva |
TG Govt.: సెప్టెంబరు 17న ప్రజాపాలన దినోత్సవం.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత సెప్టెంబరు 17కు కొత్త ప్రాధాన్యత ఏర్పడింది. ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో వేడుకలను నిర్వహిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేర్వేరు పేర్లతో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. నిజాం సంస్థానం భారత యూనియన్‌లో కలిసిపోయినందున విలీన దినోత్సవమని కొన్ని పార్టీలు, నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించినందున విమోచనా దినోత్సవమని మరికొన్ని పార్టీలు జరుపుకుంటున్నాయి. గతేడాది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచనా దినోత్సవం పేరుతో పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో నిర్వహించింది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఒకే ఘట్టానికి విభిన్న ఆలోచనలతో వేర్వేరు నిర్వచనాలు ఇస్తూ పార్టీలు, ప్రభుత్వాలు సెప్టెంబరు 17 వేడుకలను జరుపుతున్నాయి.

గతేడాది డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ సెప్టెంబరు 17 వేడుకలను జరపాల్సి వస్తున్నది. గత ప్రభుత్వం (బీఆర్ఎస్) జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో జరపగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవంగా జరుపుతున్నది. కేంద్ర ప్రభుత్వం మాత్రం గతేడాది ప్రకటించినట్లుగానే విమోచనా దినోత్సవం పేరుతో ఈసారి కూడా గ్రాండ్‌గా జరపాలనుకుంటున్నది. వామపక్ష పార్టీలు సాయుధ తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఏ పేరునూ పెట్టకుండా సెప్టెంబరు 17 వేడుకలను ర్యాలీలు, ఫొటో ఎగ్జిబిషన్ రూపంలో నిర్వహిస్తున్నాయి. ఇక మేధావులు, తెలంగాణ సాయుధ తెలంగాణ పోరాట స్ఫూర్తితో విముక్తి, విలీన దినోత్సవాల పేరుతో స్మరించుకుంటున్నారు.

ప్రజాపాలనా దినోత్సవం

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 17న ప్రజాపాలనా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో (సచివాలయం)లో ఈ వేడుకలను ప్రారంభిస్తుండగా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్‌లు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు జిల్లా కేంద్రాల్లో (కలెక్టర్ కార్యాలయాల్లో) పాల్గొంటున్నారు. ఈ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి సెప్టెంబరు 17 ప్రాముఖ్యతను వివరించనున్నారు. విలీనం, విమోచనం, విముక్తి, విద్రోహం... ఇలాంటి ఆలోచనలతో సంబంధం లేకుండా ప్రజలకు ప్రజాస్వామ్య స్ఫూర్తితో మెరుగైన పాలన అందించే ఉద్దేశంతో ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించనున్నది.

విమోచనా దినోత్సవం

నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విమోచనం లభించినందువల్ల దీన్ని విమోచనా దినోత్సవంగా జరుపుకోవడమే సమంజసమన్నది బీజేపీ వాదన. దీనికి తగినట్లుగానే కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 17 వేడుకలను రెండేండ్ల నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నది. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో గతేడాది సెప్టెంబరు 17న జరిగిన కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకాగా ఈసారి కూడా అదే వేదిక మీద మళ్లీ హాజరవుతున్నారు. సెప్టెంబరు 17కు రాజకీయ రంగును అంటించి ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో నిర్వహిస్తుండగా వాటి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వాలు కూడా విడివిడిగా వేర్వేరు పేర్లతో జరుపుకుంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed