TG Govt.: 8 నెలలు.. రూ.568.17 కోట్లు..! గతం కంటే పెరిగిన ‘మైనింగ్’ ఆదాయం

by Shiva |
TG Govt.: 8 నెలలు.. రూ.568.17 కోట్లు..! గతం కంటే పెరిగిన ‘మైనింగ్’ ఆదాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వానికి ఇసుక కాసుల వర్షం కుపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ. 568.17 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, స్పెషల్ ఫోకస్ తో మైనింగ్ శాఖ ఆదాయం పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ ద్వారా రూ. 673.55 కోట్ల ఇన్కమ్ వచ్చింది. త్వరలోనే కొత్తరీచ్ లను ఓపెన్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తుండగా.. ఆదాయం మరింత పెరిగే అవకాశముంది.

స్పెషల్ ఫోకస్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ శాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇసుక అక్రమ రవాణాపై కట్టడికి చర్యలు తీసుకున్నది. ఇసుక రీచ్ లపైనా నిఘాను పెంచింది. డిప్యూటేషన్‌ పనిచేస్తున్న ఆరుగురు అధికారులను తిరిగి సొంత శాఖలకు బదిలీ చేసింది. మాతృసంస్థ ఉద్యోగులకే బాధ్యతలు అప్పగించింది. దీంతో 8 నెలల్లోనే మైనింగ్ శాఖకు రూ. 568.17కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ లో రూ. 57.44కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ. 60.69 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 56.72 కోట్లు, మార్చిలో రూ. 83.90 కోట్లు, ఏప్రిల్ లో రూ. 80.40 కోట్లు, మే లో రూ. 78.35 కోట్లు, జూన్ లో రూ. 97.20 కోట్లు, జూలైలో రూ. 53.47కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోల్చుకుంటే రూ. 100 కోట్లకు పైగా ఆదాయం పెరిగినట్లు అధికారులు తెలిపారు. గతేడాది (2023)లో ఏప్రిల్ నుంచి జూలై వరకు కేవలం రూ.237.78కోట్లు మాత్రమే రాగా, ఈ ఏడాది(2024)లో ఏప్రిల్ నుంచి జూలై వరకు రూ.309.42 కోట్ల ఆదాయం వచ్చింది. కేవలం నాలుగు నెలల్లోనే 71.64కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని అధికారులు వెల్లడించిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

మైనింగ్ డిపార్ట్ మెంట్ ప్రక్షాళన

మైనింగ్ శాఖలో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. అందులో భాగంగానే శాఖకు కార్యదర్శిగా సురేంద్ర మోహన్ కు బాధ్యతలు అప్పగించింది. అక్రమ మైనింగ్‌, ఇసుక అక్రమ రవాణాను నియంత్రించడంలో అధికారుల వైఫల్యంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించడంతో అడ్డుకట్టపడినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించడంతోపాటు ప్రతి రోజు ఇసుక వివరాలను ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తున్నారు. దీంతో అక్రమ ఇసుక రవాణా తగ్గి ప్రభుత్వానికి ఆదాయం పెరిగినట్లు అధికారులు తెలిపారు.

కొత్త రీచ్‌ల కోసం కసరత్తు

ప్రభుత్వం కొత్త రీచ్ లను ఓపెన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం 19 వరకు ఇసుక రీచ్ లను నిర్వహిస్తుండగా మరికొన్నింటిని అందులోబాటులోకి తేవాలని భావిస్తున్నది. అధికారులు ఆ దిశగా కసరత్తును ప్రారంభించారు. వారంలోగా కొత్త రీచ్ లను ఓపెన్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇసుక ధరను సామాన్యుడికి సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సైతం పెరుగుతుందని, అక్రమరవాణాను అడ్డుకోవచ్చవని వెల్లడించారు.

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం: అనిల్, చైర్మన్, స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతున్నాం. అధికారులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ఇసుక రీచ్ లను ఏర్పాటు చేయడంతోపాటు ఇల్లీగల్ దందాను ప్రోత్సహించింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. దానికి అడ్డుకట్ట వేశాం. ఆన్ లైన్ ద్వారానే ఇసుక కేటాయింపులు చేస్తున్నాం. ఇసుక రీచ్ లను పకడ్బందీగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న లారీ యజమానులకు సైతం 15 రోజులకు ఒకసారి ఇసుక రీచ్ లనుంచి కేటాయింపులు చేస్తున్నాం. కొత్త ఇసుక రీచ్ లకు ప్లాన్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఆదాయం పెంచడంతోపాటు సామాన్యుడికి అందుబాటులోకి ఇసుకను తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

Advertisement

Next Story

Most Viewed