TG Budget 2024 : రేపు స్టేట్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న డిప్యూటీ CM భట్టి

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-24 16:42:23.0  )
TG Budget 2024 : రేపు స్టేట్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న డిప్యూటీ CM భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టనున్నది. ఉభయ సభల్లో ఒకేసారి సమర్పించేలా షెడ్యూలు రూపొందింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమర్పించనుండగా మంత్రి శ్రీధర్‌బాబు శాసనమండలిలో సమర్పించనున్నారు. రెండు సభల్లోనూ మధ్యాహ్నం 12 గంటలకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఎలాంటి సభా కార్యకలాపాలు జరగకుండా ఈ నెల 27కు వాయిదా పడనున్నాయి. బడ్జెట్‌లోని అంశాలను చదివి చర్చలో పాల్గొనేందుకు వీలుగా మరుసటి రోజున సభా కార్యక్రమాలకు సెలవు ప్రకటించడం ఆనవాయితీ. ఆ ప్రకారమే ఈసారి కూడా శాసనసభ, శాసనమండలి శనివారానికి వాయిదా పడనున్నాయి. ఆ రోజున రెండు సభల్లోనూ బడ్జెట్‌పై సాధారణ చర్చలు జరుగుతాయి. అసెంబ్లీ జూలై 29కి, మండలి జూలై 31కు వాయిదా పడనున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం (ఆర్థిక మంత్రి కూడా ఆయనే) భట్టి విక్రమార్క నాలుగు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పొందారు. ఆ గడువు ఈ నెల 31తో ముగుస్తున్నది. ఆ లోపుగానే పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో సమర్పించి ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం పొందడం అనివార్యంగా మారింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అప్పటికి ఆలోచనలో ఉన్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని వాటికి నిధుల కేటాయింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంచనాలను రూ. 2.75 లక్షల కోట్లతో రూపొందించగా పూర్తిస్థాయి బడ్జెట్ మాత్రం రూ. 2.96 లక్షల కోట్లకు పెరగవచ్చని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వనున్నదీ, సంక్షేమ పథకాలపై ఎలాంటి ఫోకస్ పెట్టనున్నదీ ఈ బడ్జెట్ ద్వారా వెల్లడి కానున్నది.

Advertisement

Next Story

Most Viewed