బీఆర్ఎస్‌లో మొదలైన టెన్షన్.. అధికార పార్టీలో ‘అసద్’ లొల్లి!

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-03 06:56:49.0  )
బీఆర్ఎస్‌లో మొదలైన టెన్షన్.. అధికార పార్టీలో ‘అసద్’ లొల్లి!
X

దిశ, ప్రతినిధి నిర్మల్: ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా వారం రోజుల కిందట ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర చర్చకు తెరలేపింది. మరోవైపు అధికార బీఆర్ఎస్‌ను ఆందోళనలో పడేసింది. తమకు మిత్రపక్షమైన ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో వ్యూహం మారుస్తుందా..? అనే ప్రశ్న ఆ పార్టీ నేతల్లో తలెత్తింది. అసద్ వ్యాఖ్యలు నిజమైతే పార్టీ తీవ్రంగా నష్టపోతుందనే టెన్షన్ గులాబీ నేతల్లో పట్టుకుంది. ఎన్నికలకు మరెంతో సమయం లేదు. చివరి క్షణంలో ఎంఐఎం అనూహ్యంగా అభ్యర్థులను బరిలో దించితే రాజకీయంగా భారీ నష్టం జరుగుతుంది. దీంతో పలువురు గులాబీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారనే టాక్ మొదలైంది. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార బీఆర్ఎస్‌లో ‘అసద్’ లొల్లి షురువైంది.

పోటీలోకి దింపితే బీజేపీకి లాభం

వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 10 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో దించుతామని అసద్ చేసిన వ్యాఖ్యలు ఏ కోణంలో చేశారనేది తెలియదు. కానీ.. అధికార బీఆర్ఎస్‌లో మాత్రం గుబులు రేపింది. బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపితే పరోక్షంగా బీజేపీకి భారీ లాభం చేకూరవచ్చు. ముధోల్, నిర్మల్, ఆదిలాబాద్, ఖానాపూర్, ఆసిఫాబాద్ సెగ్మెంట్లలో మైనార్టీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఆయా చోట్ల ఓటింగ్ ఏకపక్షంగా సాగితే ఆ పార్టీ మద్దతుతో ఏ పార్టీ అభ్యర్థి అయినా గెలిచే చాన్స్ ఉంది. లేక నేరుగా పార్టీ అభ్యర్థులను పోటీ చేయించడం ద్వారా గెలుపు సాధ్యమవుతుందా..? అనేది ముందున్న ప్రశ్న. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ట్రయాంగిల్ పోటీ చేస్తే.. నాలుగో పార్టీగా ఎంఐఎం సత్తా చాటే చాన్స్ కూడా ఉంటుంది.

ఇలాంటి కోణాల్లోనే అసద్ కీలక వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ వర్గాల్లో విశ్లేషణ సాగుతుంది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, సిర్పూర్ స్థానాల్లోనూ మైనార్టీల ఓట్ల ప్రభావం ఉంటుంది. అయితే పార్టీ అభ్యర్థులను బరిలో దించే స్థాయిలో ఆయా చోట్ల బలం లేదు. ఇప్పటికే భైంసా మున్సిపాలిటీ రెండు దశాబ్దాలుగా ఎంఐఎం ఆధీనంలోనే ఉంది. నిర్మల్, ఆదిలాబాద్ మున్సిపాలిటీల్లో ఆ పార్టీ వైస్ చైర్మన్లు పనిచేశారు. డబుల్ డిజిట్‌లోనూ కౌన్సిలర్లు గెలిచారు. బీఆర్ఎస్ కు కటీఫ్ చెప్పే ఆలోచనలో భాగంగానే చేసి ఉంటారా..? అనేది కూడా బలంగా వినిపిస్తుంది. అదే జరిగితే బీఆర్ఎస్‌పై ఎఫెక్ట్ చూపే చాన్స్ ఉంది. ఇక బీఆర్ఎస్‌తో ఎంఐఎంకు వైరం పెరిగితే కాంగ్రెస్‌తో మైనార్టీలు వెళ్లొచ్చనే టాక్ ఉంది.

గులాబీ నేతల పక్క చూపులు

అసదుద్దీన్ వ్యాఖ్యల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అప్పుడే పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. పశ్చిమ జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే బీజేపీ వైపు చూస్తున్నారు. దీనికి కారణం ఆ సెగ్మెంట్లో ఎంఐఎం కచ్చితంగా పోటీ చేస్తుందని తెలుస్తుంది. మరోరెండు చోట్ల అధికార పార్టీ వీడేందుకు కూడా సిట్టింగులు రెడీ అయ్యారు. అయితే ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారని కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Also Read..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. ఎన్నికల వేళ షాక్ ఇస్తున్న క్యాడర్

Advertisement

Next Story