- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇరుక్కున్న గులాబి లీడర్లు.. బాధితుల ప్రదక్షిణలు
దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పథకాలు అందేలా చేస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దళితబంధుకు రూ.2లక్షలు, బీసీ బంధుకు రూ.30వేలు, డబుల్ బెడ్‌రూం ఇంటికి రూ.1.50 లక్షల చొప్పున చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కాంట్రాక్టు ప్రాతిపాదికన ఉద్యోగాలు పెట్టిస్తామని కూడా డబ్బులు దండుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎన్నికల ముందు బీఆర్ఎస్ నాయకులు ప్రదర్శించిన చేతివాటం ఇప్పుడు వారిని ఇరుకున పడేసింది. ప్రభుత్వం మారడంతో దళితబంధు, బీసీబంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు వంటి పథకాలకు బ్రేక్ పడింది. దీంతో ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. స్కీం సంగతి అటుంచితే తాము ముట్టజెప్పిన సొమ్మును తిరిగి ఇవ్వాలని వారు బీఆర్ఎస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
తిరగబడుతున్న లబ్ధిదారులు
భూపాలపల్లి జిల్లాలో బీసీబంధు పథకానికి 8,177 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతలో 420 మందికి ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది. రెండో విడతలో 200 మందితో జాబితాను సిద్ధం చేసింది. అలాగే దళితబంధు పథకానికి మొదటి విడతలో 151 మందికి లబ్ధి చేకూరగా రెండో విడతలో 949 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక డబుల్ బెడ్‌రూం పథకం విషయానికి వస్తే.. ముఖ్యంగా భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని వేశాలపల్లిలో మొదటి విడతలో 544 మందికి ప్రభుత్వం ఇండ్లను పంపిణీ చేసింది. రెండో విడతలో పంపిణీ చేసేందుకు భాస్కరగడ్డ సవీపంలో 416 ఇండ్లను నిర్మించారు. అయితే, నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా రెండు నెలల కిందట జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కొంతమందికి పట్టాలను ఇచ్చారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో సైతం కొంతమంది నాయకులు డబుల్ బెడ్ రూంలు ఇప్పిస్తామని లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకున్నారు. తీరా ప్రభుత్వం మారడంతో ఇంకా తమకు ఇండ్లు రాలేదని లబ్ధిదారులు మూకుమ్మడిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తాళాలు పగలగొట్టి స్వాధీనపర్చుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపారు.
ఒకొక్కటిగా బయటకు..
బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది లీడర్ల బాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆయా పథకాల్లో లబ్ధి చేకూర్చుతామంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు కిందిస్థాయి నేతలు డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తీరా ప్రభుత్వం మారడంతో చేతులు ఎత్తేశారని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ముఖం చాటేస్తున్నారని తెలుస్తోంది. దీంతో ముడుపులు ముట్టజెప్పిన వారు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.