మునుగోడు ఉప ఎన్నిక బరిలో తెలుగు దేశం పార్టీ?

by GSrikanth |   ( Updated:2022-09-03 10:12:15.0  )
మునుగోడు ఉప ఎన్నిక బరిలో తెలుగు దేశం పార్టీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీకి సిద్ధమవుతున్నది. పార్టీ కేడర్‌ను కాపాడుకునేందుకు, బరిలో ఉండాలని అధిష్టానం భావిస్తున్నది. విజయం సాధించకపోయినా గట్టిపోటీ ఇవ్వాలని, కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించడానికి ప్లాన్ వేస్తున్నది. పార్టీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందులో బైపోల్ బరిలో నిలువాలని ఇప్పటికే జాతీయనాయకత్వం సైతం సూచించినట్లు సమాచారం.

రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. బరిలో ఉంటామని పార్టీ జాతీయ నాయకత్వం పేర్కొన్నప్పటికీ పోటీ చేయలేదు. పోటీ చేస్తామని స్థానిక నాయకులు అధిష్టానానికి బయోడేటా పంపించారు. కానీ అందుకు పార్టీ అధిష్టానం నిరాకరించింది. అయితే పార్టీకి రోజురోజుకు కేడర్ దూరమవుతుండటంతో దానిని కాపాడుకోవడానికి కసరత్తులు ప్రారంభించింది. మునుగోడు బై పోల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నది. అందుకోసం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించింది. గ్రామాల వారీగా పార్టీ కేడర్ తో సమావేశం కానున్నారు. వారి అభిప్రాయం తీసుకొని పోటీపై క్లారిటీ ఇవ్వనున్నారు. అదే విధంగా సంస్థాగతంగా బలోపేతం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

మునుగోడు నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలు జరుగగా మూడుసార్లు మాత్రమే టీడీపీ పోటీ చేసింది. వామపక్షాల పొత్తుతో8 సార్లు పోటీ చేయలేదు. కేవలం 1983, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసింది. 1999లో జెల్ల మార్కెండేయ పోటీ చేసి 41,095 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. తిరిగి 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా చిలువేరు కాశీనాథ్ పోటీ చేసి 43967 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత పోటీకి టీడీపీ దూరంగా ఉంది. 1983 లో పోటీ చేసి మూడోస్థానంలో నిలిచింది. 2018లో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ప్రకటించింది. అయితే రాష్ట్రంలో టీడీపీకి ఆదరణ ఉన్న నియోజకవర్గంలో మునుగోడు ఒకటి. బీసీ ఓటర్లు ఎక్కువ.

అయితే ఈ బై పోల్ లో పోటీ చేయాలని భావిస్తున్నది. అందులో భాగంగా ఈ నెల 13న పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పార్టీ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ తో టీటీడీపీ రాష్ట్ర కమిటీ భేటీ అయింది. పోటీపై చర్చించింది. అయితే ఒక వైపు పార్టీ నిర్మాణంపై, మరో వైపు పోటీపై కేడర్ అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. బైపోల్ లో పోటీ చేస్తేనే కేడర్ లో నూతనోత్తేజం తీసుకురావచ్చని, లేకుంటే ఉన్న కేడర్ సైతం పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఎలాగైనా పోటీ చేసి కేడర్ లో పార్టీ ఉందనే అభిప్రాయం కలిగించాలని, చేజారకుండా కాపాడుకోవాలని నేతలు భావిస్తున్నారు. త్వరలోనే గ్రామాలవారీగా సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలకు ఉప ఎన్నికల్లో వచ్చే ఓటింగ్ పైనే టీడీపీ భవిష్యత్ ఆధారపడి ఉంది.

కాంగ్రెస్‌కు మరింత గడ్డు పరిస్థితి.. మునుగోడు బైపోల్ తర్వాత ఏం జరుగనుంది?

Advertisement

Next Story