- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశానికి మరోసారి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది: KTR
దిశ, తెలంగాణ బ్యూరో: పర్యావరణ హితంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. తెలంగాణ చేపట్టిన అడవుల పెంపకం, మునిసిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అనేక పర్యావరణహిత కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్న సంస్థ, తెలంగాణ రాష్ట్రానికి అగ్రస్థానాన్ని కట్టబెట్టిందని తెలిపారు. జాతీయస్థాయిలో పర్యావరణ రంగంలో గుర్తింపు లభించడంపై ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం పచ్చదనంతో పరిఢవిల్లాలన్న బృహత్ సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన తన మానస పుత్రిక హరితహారం కార్యక్రమంతో పాటు అనేక పర్యావణహితమైన కార్యక్రమాలకు ఈ అరుదైన ఘనత దక్కిందన్నారు. హరితహారంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా, అందులో భాగస్వాములైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి అభినందనలు తెలిపారు.
భవిష్యత్తు తరాల కోసం హరించుకుపోయిన అడవులను పునరుద్ధరించి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచడం లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ప్రజల సహకారంతో ఇది ఒక ఉద్యమ రూపంలో కొనసాగిందన్నారు. గత తొమ్మిదేళ్లలో దాదాపు 273 కోట్ల మొక్కలను నాటమన్నారు. దాంతో 2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా.. 2023 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06 శాతంగా ఉన్నాయన్నారు. తెలంగాణకు హరితహారం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొన్నదన్నారు. ప్రతి గ్రామంలో ఒక నర్సరీతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు15,000 నర్సరీలు, దాదాపు 19400 పైగా పల్లె ప్రకృతి వనాలు, 2725 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణాల్లోనూ విస్తృతంగా రూ.700 కోట్లతో 180 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఫలితాలు ఫలించి హైదరాబాద్ నగరానికి వరల్డ్ ట్రీ సిటీగా రెండుసార్లు గుర్తింపు లభించిందన్నారు.
హైదరాబాద్లో వేస్ట్ టు ఎనర్జీ రంగంలో 24 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ దేశంలో రెండోస్ధానంలో నిలిచిందన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడిననాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేదని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చిత్తశుద్ధితో కూడిన ప్రత్యేక చర్యలతో రాష్ట్రంలో 5,865 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతున్నదన్నారు. సోలార్ ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంలో నిలవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.