Ministers : తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

by Kalyani |
Ministers : తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం పూర్తి సుభిక్షంగా ఉంటూ పాడిపంటలతో రైతులు ఆనందంగా జీవించాలని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం వారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ… యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ సారి వర్షాలు సుభిక్షంగా కురిసాయన్నారు. స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి, తోటి మంత్రులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం, తెలంగాణతో పాటు హైదరాబాద్ చిత్రపటాన్ని ప్రపంచంలో నిలిచే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజల సహకారం, ఆశీస్సులతో ప్రస్తుతం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు, రానున్న రోజుల్లో మరింతగా ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… లక్ష్మీనరసింహస్వామి వారి దయ వల్ల వర్షాలు బాగా కురిసాయని, పంటలు సుభిక్షంగా పండుతున్నాయన్నారు. తెలంగాణ రైతాంగం మొత్తం ప్రభుత్వం కల్పించే వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యాదగిరిగుట్ట ఆలయ అంకురార్పణలో గత ప్రభుత్వంలో తాను కూడా భాగస్వామిగా ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. తెలంగాణకే కాకుండా లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు భారతదేశం మొత్తానికి ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు.

వారితో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఉన్నారు. యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావు ఆధ్వర్యంలో అఖండ దీపారాధన పూజ నిర్వహించి, టెంకాయ మొక్కులు సమర్పించారు. మొదటగా స్వామి వారి ధ్వజస్తంభాన్ని దర్శించుకొని, అంతరాలయంలో అర్చనాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో వేదాశీర్వచనము నిర్వహించారు. ఆశీర్వచనం అనంతరం ఈవో భాస్కర్ రావు స్వామి వారి ఫోటో, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కె. జెండగే, డీసీపీ రాజేష్ చంద్రతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed