Kanpur: రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్.. లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

by vinod kumar |
Kanpur: రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్.. లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో భారీ రైల్వే ప్రమాదం తప్పింది. కాన్పూర్ జిల్లాలోని ప్రేమ్ పూర్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలను తప్పించేందుకు పలువురు కుట్ర పన్ని ట్రాక్‌పై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను పెట్టారు. దీంతో అదే ట్రాక్‌పై కాన్పూర్ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న ఓ గూడ్స్ రైలు లోకో పైలట్ సిలిండర్‌ను గుర్తించారు. అనంతరం అత్యవసర బ్రేకులు వేసి రైలును గ్యాస్ సిలిండర్‌కు సమీపంలో ఆపివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రాక్‌పై ఉంచిన 5 కిలోల సిలిండర్ స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు. కాగా, సెప్టెంబరు 15న కూడా కాన్పూర్‌లో ఒక ట్రాక్ దగ్గర పాడైపోయిన గ్యాస్ సిలిండర్, ఇతర అనుమానాస్పద వస్తువులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి గ్యాస్ సిలిండర్ రైలు పట్టాలపై ఉంచడంతో రైల్వే భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

Next Story

Most Viewed