Telangana Sentiment: మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్! కౌశిక్ వ్యాఖ్యలతో గులాబీకి డ్యామేజ్?

by Shiva |
Telangana Sentiment: మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్! కౌశిక్ వ్యాఖ్యలతో గులాబీకి డ్యామేజ్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ తెరమీదకు వచ్చింది. ఆంధ్ర, తెలంగాణ అనే అంశాలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.. ఆంధ్రవాళ్లు దాడి చేస్తే ఊరుకుంటామా.. తెలంగాణ పవర్ చూపిస్తామని హెచ్చరించడంతో ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆంధ్ర, తెలంగాణ అంశాలు కనుమరుగయ్యాయి. ప్రాంతాలు వేరైనా అందరం తెలుగు ప్రజలే అనే విధంగా సమిష్టిగా ముందుకెళ్తున్నారు.

పంచాయితీతో ప్రాంతీయ విభేదాలు?

ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, అరెకెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సవాళ్లు ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. గురువారం గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ కండువా కప్పి, ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. గాంధీ రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని.. లేకుంటే చీరగాజులు పంపుతామని స్పష్టం చేశారు. దీంతో గాంధీ సీరియస్‌గా స్పందించారు. మధ్యాహ్నం గాంధీ అనుచరులతో కలిసి కౌశిక్‌రెడ్డి ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీకి చేరుకొని ఇంటిపై దాడి చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చర్యకు ప్రతిచర్య ఉంటుందని, తెలంగాణ బిడ్డలం.. ఆంధ్రవాళ్లు వచ్చి దాడి చేస్తే ఊరుకుంటామా.. తెలంగాణ పవరేంటో చూపిస్తాం అని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ, ఆంధ్ర అంశాలు తెరమీదకు వచ్చాయి. గ్రేటర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గందరగోళానికి దారితీశాయి. ఇద్దరి మధ్య పంచాయితీ కాస్త ప్రాంతీయ విభేదాలకు దారితీస్తాయా? అనే చర్చ జరుగుతోంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయం నాటి పరిస్థితులు ఏర్పడుతాయా? అనే ఆందోళన ప్రజల్లో ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న సమయంలో మధ్య మళ్లీ ప్రాంతీయ అంశాన్ని కౌశిక్‌రెడ్డి లేవనెత్తడంతో ఏం జరుగుతుందోననే చర్చ సాగుతోంది. కౌశిక్ వ్యాఖ్యలపై గాంధీ సైతం ఘాటుగా స్పందించారు. మూడుసార్లు ఎమ్మెల్యేనని, ప్రజల ఆశీర్వాదంతో తాను గెలిచానని, ప్రాంతీయ విభేదాలు చూపుతాడా.. బతకడానికి వచ్చానని అంటారా? ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని గాంధీ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం తీవ్రస్థాయిలో స్పందించారు. హైదరాబాద్‌‌కు బతకడానికి వచ్చిన వాళ్ల ఓట్లు కావాలి కానీ వారికి సీట్లు ఇవ్వొద్దా?.. అంటూ గాంధీపై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు సరికావన్నారు. కాంగ్రెస్ లీడర్లు సైతం కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.

బీఆర్ఎస్‌కు అండగా నిలిచిన సెటిలర్ ఓటర్లు

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సెటిలర్లు అండగా నిలిచారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆంధ్రప్రాంత ప్రజలు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో గులాబీకి పట్టం కట్టారు. గ్రేటర్ పరిధిలో 16 స్థానాల్లో బీఆర్ఎస్‌ను గెలిపించారు. జాతీయ పార్టీలను కాదని కేసీఆర్‌కు అండగా నిలిచారు. ఏ ఎన్నికలు వచ్చినా వారి ఓట్లు కీలకం. బీఆర్ఎస్‌కు రాష్ట్రవ్యాప్తంగా 39 అసెంబ్లీ స్థానాలు వస్తే... అందులో మెజార్టీ స్థానాలు గ్రేటర్ నుంచే వచ్చాయి. పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడంలోనూ గ్రేటర్‌ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. ఇప్పుడు కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేస్తాయని గులాబీ నేతల్లో చర్చ మొదలైంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కౌశిక్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

కౌశిక్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, టీఎస్ఎఫ్ ఫౌండర్, ప్రెసిడెంట్

ఆంధ్రావాళ్లు వచ్చి దాడిచేశారని కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఆంధ్ర, తెలంగాణ వాదం ఎందుకు వచ్చింది. మీరు రాజకీయం వాడుకోవాడానికి ప్రాంతీయ భేదాలు సృష్టించడం సరికాదు. గుడివాడ నుంచి గాంధీ వచ్చి దాడిచేస్తే తెలంగాణ సత్తా చూపుతామని హెచ్చరికలు సరికావు. ఎన్నో ఏండ్ల క్రితమే వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడి వారంతా స్థానికులే. తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములే. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించడం మంచిదికాదు. పీఏసీ చైర్మన్ అంశంపై రాజ్యాంగబద్ధంగా చూసుకోండి. కానీ ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దు. ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం మానుకోవాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతామని చెప్పడం మహిళలను అవమానించడమే. మీరు ఏదైనా చూసుకోవాలంటే రాజకీయ సవాల్ చేసుకోండి. కానీ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు సరికాదు.

Advertisement

Next Story

Most Viewed