జేడీఎస్ ‘మేనిఫెస్టో’లో తెలంగాణ స్కీమ్స్

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-20 04:32:56.0  )
జేడీఎస్ ‘మేనిఫెస్టో’లో తెలంగాణ స్కీమ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్‌తో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్న జేడీఎస్, తెలంగాణ పథకాలను కర్ణాటకలో అమలు చేస్తామని హామీ ఇస్తున్నది. ఇంకా మేనిఫెస్టోను రిలీజ్ చేయకపోయినా, అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 12 అంశాలను మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, ఆసరా పింఛన్ల వంటి స్కీమ్స్ తోపాటు అంగన్ వాడీ వర్కర్లకు వేతనాల పెంపు, సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు వంటి అంశాలు ఉన్నాయి. త్వరలో పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు జేడీఎస్ ప్రకటించింది.

రైతుబంధులా ‘రైత చైతన్య’..

రైతుబంధు పథకాన్ని ‘రైత చైతన్య’ పేరుతో కర్ణాటకలో అమలు చేయనున్నట్లు జేడీఎస్ ప్రకటించింది. సొంత భూమి ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి సంవత్సరానికి రూ. 10 వేల చొప్పున అందజేయనున్నట్లు స్పష్టం చేసింది. రైతు కూలీలకు నెలకు రూ. 2 వేల చొప్పున అందించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణలో అమలవుతున్న ఆసరా పింఛన్లను కూడా జేడీఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టనున్నది. ప్రస్తుతం వికలాంగులకు నెలకు రూ. 600గా ఉన్న పింఛన్‌ను ‘వికల చేతన ఆసరా’ పేరుతో నెలకు రూ. 2,500కు పెంచనున్నట్లు తెలిపింది. వింతు మహిళలకు కూడా ప్రస్తుతం అందుతున్న రూ. 900 పింఛన్‌ను రూ. 2,500కు పెంచనున్నట్లు పేర్కొన్నది.

ఇంకా అనేక పథకాలు..

తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు గతంలో గౌరవ వేతనాలను పెంచింది. అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 4,200 నుంచి రూ. 7,000కు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ. 2,450 నుంచి రూ. 4,500కు పెంచింది. ఇప్పుడు జేడీఎస్ సైతం ఈ వేతనాలను ముగ్గురికీ ఒకే తరహాలో ఉండేలా నెలకు రూ. 5,000గా ఫిక్స్ చేసింది. సీనియర్ సిటిజన్లకు నెలకు రూ. 5 వేల వరకు ఆర్థిక సాయం అందించనున్నది.

రైతు కుటుంబాలకు చెందిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే రూ. 2 లక్షలు వధువుకు అందించే స్కీమ్‌ను కూడా అమలు చేస్తామని ప్రకటించింది. సాగునీటి ప్రాజెక్టులకు రానున్న ఐదేండ్ల కాలంలో లక్షన్నర కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. స్త్రీశక్తి మహిళా సంఘాలకు సంవత్సరానికి ఐదు వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. గర్భిణులకు నెలకు రూ. 6 వేల చొప్పున మొత్తం ఆరు నెలల పాటు ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నది.

హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌లో ప్రభావం..

తెలంగాణ పథకాలను కర్ణాటకలోనూ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి గతంలోనే హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఇప్పుడు మేనిఫెస్టోలో చేరుస్తున్నారు. దీంతో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం సహా రాష్ట్రవ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. జేడీఎస్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామంటూ తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల చివర్లో లేదా మే నెల ప్రారంభంలో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో ప్రచారం చేసే అవకాశం ఉన్నది.

తెలంగాణలో అమలవుతున్న పలు పథకాలను ప్రస్తావించడంతో పాటు జేడీఎస్ తన మేనిఫెస్టోలో పెట్టినవాటిని కూడా తెలుగు మాట్లాడే ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వివరించే అవకాశం ఉన్నది. రైతుబంధు స్కీమ్ ద్వారా తెలంగాణ రైతుల్లో పెరిగిన జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిపుష్టి గురించి వివరించనున్నారు. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు గురించి వివరించడంతోపాటు కర్ణాటకలో జేడీఎస్ అధికారంలోకి వస్తే లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చుతో రానున్న ఐదేళ్ల కాలంలో నిర్మించే ప్రాజెక్టుల గురించి ప్రస్తావించే అవకాశమున్నది. తెలంగాణ పథకాలు దేశానికే రోల్ మోడల్ అని ఇప్పటివరకూ ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ నేతలు తాజాగా జేడీఎస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నవాటిని ప్రస్తావించి అన్ని పార్టీలకూ అనుసరణీయమనే నినాదాన్ని అందుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed