ఆఫ్ఘనిస్తాన్‌లో కేసీఆర్ 'కంటివెలుగు' యాడ్!

by GSrikanth |   ( Updated:2023-01-21 15:02:38.0  )
ఆఫ్ఘనిస్తాన్‌లో కేసీఆర్ కంటివెలుగు యాడ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆఫ్ఘనిస్తాన్‌లోనూ కంటి వెలుగు పథకానికి సంబంధించిన యాడ్ ఇచ్చుకున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. కంటి వెలుగుకు కేటాయించిన రూ.200 కోట్ల బడ్జెట్‌లో రూ.50 కోట్లు ప్రచారానికే ఖర్చుపెట్టారని అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలోనే రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు ఉన్నాయనే విషయం సీఎం కేసీఆర్‌కు తెలుస్తున్నట్లుందని బూర చురకలంటించారు. 2018 ఎన్నికలకు ముందు కూడా ఆయన ఇలాగే చేశారని, తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ కంటివెలుగును తెరపైకి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.

ప్రతిసారి ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని ఎందుకు తీసుకొస్తున్నారో సీఎం కేసీఆర్ సమాధనాం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బాహుబలి పార్ట్-1, పార్ట్-2 లాగా కంటి వెలుగు పథకం కూడా పార్టు పార్టులుగా వస్తోందని సెటైర్లు వేశారు. మొదటి విడత కంటి వెలుగులో ఆపరేషన్ల కారణంగా 18 మంది అంధులయ్యారనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని సూచించారు. ఫస్ట్ ఫేజ్‌లో రూ.100 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మెషీన్లు ఏమయ్యాయని బూర ప్రశ్నించారు. రూ.200 కోట్ల బడ్జెట్‌లో రూ.50 కోట్లు ప్రచారానికి పోగా మిగిలిన రూ.150 కోట్లలో ఒక్కో మనిషిపై ఖర్చు పెట్టేది కేవలం రూ.35 మాత్రమేనని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. కండ్లు కనిపించినా.. కనిపించకపోయినా ప్రతి ఒక్కరికీ కేసీఆర్ బొమ్మ ఉన్న గ్లాసెస్ ఇచ్చి పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎలాంటి టెండర్లు పిలవకుండానే కంటి వెలుగు అద్దాల కాంట్రాక్ట్‌ను సొంత పార్టీకి చెందిన వ్యక్తికి కట్టబెట్టారని బూర ఆరోపణలు చేశారు.

కంటి వెలుగు పథకంలో భాగంగా చెకప్ చేసేందుకు ఒక్క డాక్టర్‌ను అయినా నియమించారా? అని బూర ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఏ స్కీంలోనూ స్కాం లేకుండా లేదని ఆయన ఆరోపణలు చేశారు. లక్షన్నర మెషీన్‌ను రూ.రెండున్నర లక్షలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రిని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వైద్య రంగాన్ని ప్రైవేట్ పరంచేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ రీజినల్ కంటి ఆసుపత్రిలో కేవలం కాంట్రాక్ట్ ఆపరేషన్ చేస్తున్నారన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రతి జిల్లా ఆసుపత్రి, ఏరియా దవాఖానల్లోనూ ప్రత్యేక 'ఐ' వింగ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో రూ.35 వేల కోట్ల మెడికల్ బిజినెస్ నడుస్తోందని బూర నర్సయ్య గౌడ్ ఆరోపణలు చేశారు. రెండు టర్మ్‌లు ప్రజలు అధికారమిస్తే ఒక్క కొత్త ప్రభుత్వ ఆసుపత్రి అయినా కట్టారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల వేళ టిమ్స్ హాస్పిటల్ అంటూ కేసీఆర్ కొత్త నాటకానికి తెరదీశారన్నారు.

బీఆర్ఎస్ ఖమ్మం సభలో సీఎం స్పీచ్‌లో పస లేదు, బీఆర్ఎస్‌కు బస లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో కరప్షన్ భారీగా పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి వెయ్యి ఏండ్లకు సరిపడా బీఆర్ఎస్ నేతలు సంపాదించుకుంటున్నారని ఫైరయ్యారు. భారీగా కరప్షన్‌కు పాల్పడిన వారిలో నలుగురికి నలుగురు నేతలు ఖమ్మంలోనే ఉన్నారని బూర సంచలన కామెంట్లు చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ కరప్టెడ్ పార్టీ బీఆర్ఎస్ అని బూర ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని, ఆయన ఆర్ట్ ఆఫ్ పొలిటికల్ హానెస్ట్ యూనివర్సిటీకి వైస్ చాన్స్‌‌లర్ అయితే సీఎం కేసీఆర్ ఆర్ట్ ఆఫ్ కరప్షన్ యూనివర్సిటీకి వీసీ అని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి జరగకుండా కేసీఆర్ సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత పొత్తులతో కమ్యూనిస్టులు కేడర్ కోల్పోయారని, ఇప్పుడేమో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకొని క్యారెక్టర్ కూడా కోల్పోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్లమెంట్ ఎదుట 'పంటి వెలుగు' కార్యక్రమాన్ని పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్ పథకాలకు ఇక్కడెవరూ చప్పట్లు కొట్టట్లేదని తెలిసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు డబ్బులిచ్చి మరీ తీసుకొచ్చి చప్పట్లు కొట్టించుకుంటున్నారన్నారు. పేదల కోసం కంటివెలుగు తీసుకొస్తున్నట్లు చెప్పిన సీఎం కళ్లద్ధాల ధర అక్షరాలా రూ.9 లక్షలు అని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. కంటి వెలుగు పథకంపై తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని, వాటిని సవరణలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్లు బూర తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed