Telangana Police: గుండెను తరలింపుకు గ్రీన్ వే ఏర్పాటు.. ట్రాఫిక్ పోలీసులపై ప్రశంసలు

by Ramesh Goud |   ( Updated:2024-09-05 12:32:24.0  )
Telangana Police: గుండెను తరలింపుకు గ్రీన్ వే ఏర్పాటు.. ట్రాఫిక్ పోలీసులపై ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హ్యాట్యాఫ్ తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ అంటూ ట్రాఫిక్ సిబ్బందిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం గుండె మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఇందుకోసం ఓ ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి గుండె తరలించాల్సి ఉంది. దీంతో హాస్పిటల్ వైద్యులు గుండెను తరలించేందుకు 40 నిమిషాల సమయం మాత్రమే ఉందని, గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని పోలీసులను సంప్రదించారు. దీనికి ట్రాఫిక్ పోలీసులు అన్ని విధాలుగా సహాకరిస్తామని చెప్పి, రూట్ మ్యాప్ ను సిద్దం చేశారు.

ట్రాఫిక్ పోలీసుల భరోసాతో వైద్యులు ఆపరేషన్ కు సిద్దం చేసుకున్నారు. గుండె బదిలీ చేసే సమయానికి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నిలిపి వేసి, గ్రీన్ వే ను ఏర్పాటు చేశారు. దీంతో వైద్య సిబ్బంది లైవ్ హార్ట్ బాక్స్ అంబులెన్స్ లో తీసుకెళుతుండగా.. పోలీసు సిబ్బంది అంబులెన్స్ ముందు వెళుతూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. దీంతో 35 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 35 నిమిషాల్లోనే ప్రయాణించగలిగేలా ఏర్పాటు చేశారు. దీనిపై ఒక ప్రాణాన్ని కాపాడేందుకు చేసిన గొప్ప ప్రయత్నాన్ని విజయవంతం చేసినందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. అంతేగాక హ్యాట్సాఫ్ తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ అంటూ నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed