తెలంగాణ MLA అభ్యర్థులపై భారీగా కేసులు.. వివరాలు బయటపెట్టిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

by Satheesh |   ( Updated:2023-11-21 13:00:58.0  )
తెలంగాణ MLA అభ్యర్థులపై భారీగా కేసులు.. వివరాలు బయటపెట్టిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల అభ్యర్థులలో నేర చరిత్ర కలిగిన వారు అధికంగా ఉన్నారని.. అందువల్ల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునే ముందు తమ అభ్యర్థుల నేర చరిత్రను చూసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చైర్మన్ పద్మనాభరెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల అభ్యర్థుల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసులను వివరించారు.

ఈ నాలుగు పార్టీలలో బరిలో నిలిచిన అభ్యర్థులలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులపై అత్యధికంగా 84 (71 శాతం) మంది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వివరించారు. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థులలో 78 (70 శాతం) మంది, ఎంఐఎం పార్టీ అభ్యర్థుల్లో 6 (50శాతం) శాతం, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న 58 (48 శాతం) మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వివరించారు. 119 నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన పార్టీల తరపున మొత్త 360 మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే వారిలో 226 మందికి నేర చరిత్ర ఉందని తెలిపారు.

అయితే ఈ కేసుల్లో సగం మంది అభ్యర్థులపై భూ ఆక్రమణ, బెదిరింపులు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులు ఉండగా వీటితో పాటు ఉద్యమం సందర్భంగా కొన్ని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి నమోదైన కేసులు ఉన్నట్లు తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై అందరికంటే అత్యధికంగా 89 చొప్పున కేసులు ఉండగా.. ఆ తర్వాత బండి సంజయ్‌పై 59, ఖానాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జుపై 52, ఈటల రాజేందర్‌పై 44 కేసులు ఉన్నాయన్నారు. కాగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 119 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 111 స్థానాలు, కాంగ్రెస్ 118, ఎంఐఎం 12 స్థానాల్లో అభ్యర్థులను దింపాయి.

Advertisement

Next Story

Most Viewed