దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తోన్న 3వ రాష్ట్రం తెలంగాణ: Minister Thanneeru Harish Rao

by Satheesh |   ( Updated:2023-01-29 10:55:53.0  )
దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తోన్న 3వ రాష్ట్రం తెలంగాణ: Minister Thanneeru  Harish Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి నివేదికను ఆదివారం ఆయన విడుదల చేశారు. దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా తెలంగాణను నీతి అయోగ్ గుర్తించిందని పేర్కొన్నారు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్‌ని 43 శాతానికి తగ్గించి.. ఎంఎంఆర్ రేట్ అతి తక్కువ ఉన్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచినట్లు తెలిపారు. ఇన్ ఫాంట్ మోర్టాలిటీ రేట్ 2014 నాటికి రాష్ట్రంలో 39 ఉండగా.. ప్రస్తుతం 21కి తగ్గించామన్నారు. ఏడాది కాలంలో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాగా.. మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్, 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

హైదరాబాద్ నలుమూలల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్‌లో మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని చెప్పారు. నిమ్స్ ఆస్పత్రిలో బెడ్ల సంఖ్యను 1489 నుంచి 3489కి పెంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో భాగంగా ఉచితంగా ఒక కోటి కంటే ఎక్కువ వైద్య పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్స్ హబ్స్ ఉండగా.. త్వరలో మరో 13 జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కేసీఆర్ కిట్ ద్వారా 13.91 లక్షల మందికి ప్రయోజనం చేకూరిందన్నారు.

Advertisement

Next Story