LRS Scheme : ఎల్ఆర్ఎస్‌ విధివిధానాలు రిలీజ్.. వారికే చాన్స్ అంటున్న రేవంత్ సర్కార్

by Ramesh N |   ( Updated:2024-08-16 14:51:45.0  )
LRS Scheme : ఎల్ఆర్ఎస్‌ విధివిధానాలు రిలీజ్.. వారికే చాన్స్ అంటున్న రేవంత్ సర్కార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అనుమతి లేని, చట్టవిరుద్ధమైన లేఅవుట్లు, పాట్ల క్రమబద్ధీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్ చేసుకున్న లేఅవుట్లకు మాత్రమే ఎల్‌ఆర్ఎస్(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) వర్తిస్తుందని ప్రకటించారు. 2020 అక్టోబర్ 15లోపు స్వీకరించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్‌పై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

4,28,832 దరఖాస్తులు ప్రాసెస్..

నియమ నిబంధనలు 2020లో విడుదల చేసినప్పటికీ ఈ ఏడాది జనవరిలో దరఖాస్తుల పరిశీలన మొదలైందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4,28,832 దరఖాస్తులు ప్రాసెస్ చేశామని వెల్లడించారు. అందులో 60,213 దరఖాస్తులు ఆమోదం పొందాయని, దీంతో రూ.96.60 కోట్లు వసూలు అయినట్లు పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి వివరించారు. దరఖాస్తులకు సంబంధించి దాదాపు 75 శాతం మంది పూర్తి వివరాలు సమర్పించలేదని తెలిపారు. తగిన డాక్యుమెంట్లు లేవని దరఖాస్తుదారులకు ఇప్పటికే తెలియజేశామని, వాటిని అప్‌లోడ్‌ చేయడం కుదరకపోగా సకాలంలో ప్రాసెస్‌ చేయలేకపోయామని చెప్పారు. డాక్యుమెంట్లు అందజేసేందుకు దరఖాస్తుదారులకు అవకాశం కల్పించామని స్పష్టంచేశారు. సేల్‌ డీడ్‌, ఈసీ, మార్కెట్‌ విలువ సర్టిఫికెట్‌, లేఅవుట్‌ కాపీలను అప్‌లోడ్‌ చేయవచ్చని సూచించారు. దరఖాస్తుదారులు తమ మొబైల్ నంబర్, చిరునామాను ఇతర వివరాలు ఓటీపీ ఉపయోగించుకుని ఎడిట్ చేసుకోవచ్చని సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఏవైనా సందేహాలుంటే హెల్ప్ డెస్క్‌లను సందర్శించి పరిష్కరించుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed