సర్కారు కొత్త స్కీమ్.. రైతులకు అధిక ప్రయోజనం కలిగేంచేలా ప్లాన్

by Gantepaka Srikanth |
సర్కారు కొత్త స్కీమ్.. రైతులకు అధిక ప్రయోజనం కలిగేంచేలా ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) దక్షిణ భాగాన్ని సొంత ఖర్చులతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నది. సొంతంగా నిర్మిస్తే, ప్రభుత్వంపై భారం పడకుండా సరికొత్త ప్లాన్ తయారు చేస్తున్నట్టు తెలిసింది. భూ సేకరణ జోలికి వెళ్లకుండా, ల్యాండ్ ఫూలింగ్ పై దృష్టిపెడుతున్నట్టు సమాచారం. దీంతో అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు జరిగే కేబినెట్ సమావేశంలో దక్షిణ భాగం నిర్మాణంపై ప్రధానంగా చర్చించే అవకాశముందని సమాచారం.

తక్కువ ఖర్చు.. ఎక్కువ ప్రయోజనం

సుమారు 355 కి.మీలో పొడువు ఉండే రీజినల్ రింగ్ రోడ్డులో ఉత్తర భాగమైన సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జగదేవ్ పూర్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఉన్న రోడ్డును (161కి.మీ) కేంద్రం నిర్మిస్తున్నది. కానీ దక్షిణ భాగం చౌటుప్పల్ నుండి ఆమన్ గల్, షాద్ నగర్, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు (194 కి.మీ) ఉన్న రోడ్డును నిర్మించేందుకు కేంద్రం చేతులు ఎత్తేసింది. దీంతో రాష్ట్రమే సొంతంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నది. అయితే ఉత్తర భాగంలో మాదిరిగా రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణ చేయకుండా, ల్యాండ్ పూలింగ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో భూములు కోల్పోయిన రైతులకు మేలు జరుగుతుందని ఆయన అంచనా వేస్తున్నట్టు తెలిసింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సేకరణ చేయడం వల్ల రోడ్డు నిర్మాణ వ్యయం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర భాగం నిర్మాణానికి సుమారు రూ. 17 వేల కోట్లు ఖర్చు అవుతుండగా, అందులో సగం నిధులు కేవలం భూ సేకరణ కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. కాని ల్యాండ్ పూలింగ్ ద్వారా నిర్మించే దక్షిణ భాగంలో కేవలం రోడ్డు నిర్మాణ ఖర్చులు మాత్రమే ఉంటాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.

రైతులకు మేలు చేసే ప్లాన్

ల్యాండ్ పూలింగ్ ద్వారా నిర్మించే దక్షిణ భాగం రోడ్డులో భూములు కోల్పోయే రైతులకు అధిక ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఉదాహరణకు ఓ రైతు తన రెండు ఎకరాల భూమిని రోడ్డు నిర్మాణంలో కోల్పోతే.. ఆయనకు ట్రిపుల్ ఆర్ పక్కనే నిర్మించే టౌన్ షిప్ లో భాగస్వామ్యం కల్పించే విధంగా స్కీమ్ తయారు చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. సదరు రైతు తన రెండు ఎకరాల భూమిని అమ్ముకుంటే లభించే ధర కంటే అధిక ప్రయోజనం కలిగే విధంగా టౌన్ షిప్ లో వాటా కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీంతో రైతులు స్వచ్ఛందంగా తమ భూములను రోడ్డు నిర్మాణం కోసం అప్పగిస్తారని ప్రభుత్వం భావిస్తున్నది. దక్షిణ భాగం రోడ్డు చుట్టూ ఆధునిక టౌన్ షిప్స్, ఐటీ కారిడార్స్, ఎడ్యుకేషనల్, మెడికల్ హబ్స్, ఎంటర్ టైన్మెంట్ పార్క్స్ ఏర్పాటు చేసేవిధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed