కూలీల కొరతకు చెక్.. సర్కార్ కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-04 02:05:29.0  )
కూలీల కొరతకు చెక్.. సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పత్తి ఏరివేతకు త్వరలో రోబోలు రానున్నాయి. ఇప్పటివరకు మన రాష్ట్రంలో టెక్నాలజీని వినియోగించి వరి పంటను మాత్రమే కోస్తుండగా, రాబోయే రోజుల్లో పత్తి ఏరివేతకు కూడాటెక్నాలజీని వాడనున్నారు. రూ. 7 లక్షల విలువతో మనుషులను పోలిన రోబోలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని కేవలం పత్తికే కాకుండా మిర్చి పంట కోత, వివిధ రకాల కూరగాయల కోతలకు కూడా వినియోగించేలా రూపొందించనున్నారు. త్వరలో రాష్ట్రంలో తొలి విడత ఒకటి రెండు జిల్లాల్లో పైలెట్​ ప్రాజెక్ట్​గా అందుబాటులోకి తీసుకురానున్నారు. దాని ఫలితాలు, రైతుల నుంచి వచ్చే స్పందన బట్టి అన్ని జిల్లాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయనున్నట్లు వ్యవసాయశాఖలోని ఓ ముఖ్య అధికారి తెలిపారు. ఇప్పటికే ఈ రోబోల విధానంపై కోయం బత్తూర్​లో డెమోను పరిశీలించినట్లు ఆయన వివరించారు.

వేధిస్తున్న కూలీల కొరత...

రాష్ట్రంలో ప్రస్తుతం పత్తి ఏరివేత, మిర్చి పంట కోతలకు కూలీల కొరత వేధిస్తున్నది. రోజుకు రూ. 500 చొప్పున ఇచ్చేందుకు పెద్ద రైతులు సిద్ధమవుతున్నా.. కూలీలు లభించడం లేదు. చేసేదేమీ లేక చాలా మంది రైతులు గోదావరి జిల్లాల నుంచి కూలీలను ప్యాకేజీ విధానంలో తెచ్చుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలో పనిలో ఆలస్యమవడమే కాకుండా, అదనపు ఖర్చు అవుతున్నది. దీంతో రైతులకు ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదు.

స్పెన్సర్లతోనే ...

మనుషులకు రెండు చేతులు ఉన్నట్లు రోబోకు ఇరువైపుల ప్రత్యేక పరికరాలను అమర్చుతారు. మనిషి తీసినట్లే రోబో తన రెండు చేతులతో పత్తిని ఏరివేస్తున్నది. అయితే ఎలా చేయాలనేది రైతులు ఒక దగ్గర కూర్చోని ఆపరేట్​ చేస్తే సరిపోతుంది. సెన్సార్లు ఆదరంగా చెట్టు నుంచి పత్తిని వేరు చేస్తుంది. ఆరు గంటల్లో రోబో ఒక్క చేత్తో 50 క్వింటాళ్ల పత్తిని ఏరివేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇతర మిర్చి , కూరగాయల కోతలకు మాత్రం అదనపు పరికరాలు అమర్చాల్సి వస్తుందని ఆఫీసర్లు పేర్కొన్నారు.

మన దగ్గర పత్తే టాప్​...

రాష్ట్ర వ్యాప్తంగా రెయినీ సీజన్లో ప్రధానంగా సాగయ్యే పంటల్లో పత్తి టాప్ ప్లేస్ లో ఉన్నది. అంతర్జాతీయంగా మన పత్తికి డిమాండ్ ఎక్కువ ఉండటంతో లాభాలు వస్తున్నాయే ఆశతో చాలా మంది రైతులు పత్తి పంటనే సాగు చేస్తున్నారు. 2020 ఖరీఫ్​ లో 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, 2021లో దాదాపు 50 లక్షల ఎకరాల్లో వేశారు. దీంతో పంట సాగు పెరిగి కూలీల కొరత ఏర్పడింది. విత్తనాలు నాటు, కలుపు, పత్తి తీసేందుకు కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో రోబోలతో ఆ పనులు చేయించేలా అధికారులు ప్లాన్‌లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed