ప్రభుత్వ భూ వివరాల సేకరణపై సర్కారు ఫోకస్

by GSrikanth |   ( Updated:2023-02-18 01:51:20.0  )
ప్రభుత్వ భూ వివరాల సేకరణపై సర్కారు ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఉన్న సర్కారు భూముల వివరాలపై ప్రభుత్వం ఆరా తీయడం మొదలుపెట్టింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి వివరాలను సేకరిస్తున్నది. ఇప్పటికే గ్రామాలు, మండలాలవారీగా రెవెన్యూ శాఖ దగ్గర వివరాలు ఉన్నప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా క్రోడీకరించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం మొత్తం పన్నెండు రకాలుగా భూముల వివరాలను పంపించాలని ప్రధాన కార్యదర్శి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం నిర్దిష్టంగా ఒక ఫార్మాట్‌ను కూడా అన్ని జిల్లాలకు సర్కారు పంపింది. అసెంబ్లీ నియోజకవర్గాలను యూనిట్‌గా తీసుకున్నది. ఈ వివరాలతో కూడిన జాబితాను తయారు చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేంటి అనే చర్చలు మొదలయ్యాయి.

ఎందుకోసం?

ఇప్పటికే ప్రభుత్వం దగ్గర అన్ని రకాల భూముల వివరాలు ఉన్నాయి. తాజాగా సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం పన్నెండు రకాల భూములను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సేకరించే టాస్కును జిల్లా కలెక్టర్లు చేపట్టారు. అందులో ప్రభుత్వ భూమి, సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు పరిధిలో ఉన్నవి, సీలింగ్ లాండ్, ఆబాదీ/గ్రామంకంఠం, ఎండోమెంట్ (దేవాదాయ) భూములు, వక్ఫ్ లాండ్, శిఖం/చెరువు భూములు, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన భూములు, ప్రభుత్వ లీజ్ భూములు, నోటరీ చేసిన పట్టా భూములు, పట్టా భూముల్లోని సాదా బైనామా కేటగిరీ, పై విభాగాల పరిధిలోకి రాని ఇతర భూముల వివరాలనూ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సేకరించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ వివరాలు అందిన తర్వాత ప్రభుత్వం ఏం చేయనున్నదనేది ఆసక్తికరంగా మారింది.

సొంత జాగ ఇవ్వడానికేనా?

సొంత జాగ ఉన్నవారికి ఇల్లు కట్టుకోడానికి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నట్టు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లోనే పేర్కొన్నది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను సైతం కేటాయించింది. గత బడ్జెట్‌లో సైతం ఈ ప్రస్తావన చేసినప్పటికీ అప్పట్లో అది అమలుచేయలేదు. కానీ ఈసారి ఎన్నికలు జరగనున్నందున ఏప్రిల్ నెల నుంచే దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉన్నది. దీనికోసమే ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నది. రూ.3 లక్షల స్కీంలో భాగంగా.. ఎన్ని ఇండ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సి ఉంటుంది? ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు? సొంత జాగలేని పేదలకు గృహ వసతి కల్పించేదెలా? వారిని గుర్తించి ఎంపిక చేసేదెలా? ఇలాంటి అనేక అంశాలపై ఈ వివరాల ద్వారా స్పష్టత ఏర్పడనున్నది. ఇతర పథకాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారో కూడా ప్రభుత్వం దగ్గర ఇప్పటికే లెక్కలు ఉన్నాయి. సొంత జాగ ఉండి ఇల్లు లేనివారికి ఆర్థిక సాయం చేసే సమయంలో అసలు జాగానే లేని కుటుంబాల సంగతేంటనే చర్చ చాలాకాలంగా జరుగుతున్నది. దానికి కూడా ఒక స్కీమ్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నదేమో అనే గుసగుసలు రెవెన్యూ శాఖ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కనీసంగా 70 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని ఇచ్చే ఆలోచన ఉన్నట్లు సమాచారం.

ప్రభుత్వం ఎప్పటి నుంచో 'దేశమే అబ్బురపడే' కొత్త స్కీమ్‌ను రూపొందించాలనుకుంటున్నది. గతంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రే దీనిపై హామీ ఇచ్చారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున అలాంటి స్కీమ్ రూపకల్పన కోసమే ఈ వివరాలను సేకరిస్తున్నదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలను కన్సాలిడేట్ చేయడంపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ కసరత్తుకు శ్రీకారం చుట్టిందనేది కీలకంగా మారింది. భూ విషయంలో పాత పథకాల్లో ఏ మేరకు లబ్ధిపొందుతున్నారు? ప్రభుత్వం నుంచి ఎంత మేర వారికి సాయం రూపంలో అందుతున్నది? అనే లెక్కలు వేసి కొత్త స్కీమ్‌లో వారిని అర్హులుగా ప్రకటించాలా? వద్దా? అనేదానిపైనా ప్రభుత్వం ఆలోచించే అవకాశమున్నది. అన్ని సెగ్మెంట్ల నుంచి ఈ వివరాలు అందిన తర్వాత ప్రభుత్వ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త స్కీమ్‌లో అర్హత సాధించే సంగతి ఎలా ఉన్నా పాత పథకంలో కోత పడే అనుమానం కూడా పలు సెక్షన్ల ప్రజల్లో వ్యక్తమవుతున్నది.

దళితబంధు స్కీమ్‌ ద్వారా సాయం అందుకున్న పలు కుటుంబాలకు ఆసరా పించన్ల విషయంలో కోత పడింది. ఇదే విషయాన్ని ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగానూ పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. వీటన్నింటికి తోడు కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌ను నెలకొల్పడానికే ప్రభుత్వం ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నదా? అనే చర్చలూ జరుగుతున్నాయి. సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ పరిశ్రమల స్థాపనపై బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా కేసీఆర్ ప్రస్తావించారు. దీనికి తోడు తాజా బడ్జెట్‌లో భూముల అమ్మకం ద్వారా (నాన్ టాక్స్) ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న సర్కారు భూములను విక్రయించే ఆలోచన కూడా చర్చల్లో నలుగుతున్నది. ప్రభుత్వం మదిలో ఉన్న ఆలోచన స్పష్టంగా బహిర్గతం కానప్పటికీ అన్ని సెగ్మెంట్ల నుంచి వివరాలు వచ్చిన తర్వాత ఎలాంటి దిశగా అడుగులు పడతాయనేది వెల్లడి కానున్నది.

Advertisement

Next Story

Most Viewed