ఎన్నికలకు టీ-కాంగ్రెస్ రెడీ.. అభ్యర్థుల జాబితా సిద్ధం!

by Web Desk News |   ( Updated:2022-03-03 09:15:35.0  )
ఎన్నికలకు టీ-కాంగ్రెస్ రెడీ.. అభ్యర్థుల జాబితా సిద్ధం!
X

ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ఇతర పార్టీలో అవకాశం లేక కాంగ్రెస్‌లో చేరే వారికి ఎట్టి పరిస్థితిలోనూ టికెట్లు ఇవ్వవద్దనుకుంటున్నది. జనాదరణ, ఆర్థికంగా నిలదొక్కుకునే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్న పీసీసీ చీఫ్​ఓ జాబితాను సైతం సిద్ధం చేసుకున్నట్టు టాక్. దీనిపై ఏఐసీసీ పెద్దల నుంచి సైతం క్లారిటీ వచ్చిందని తెలుస్తున్నది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ సైతం పీసీసీ చీఫ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తన వ్యూహాన్ని మార్చుకుంటున్నది. టికెట్ కోసం కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి టికెట్ ఇవ్వబోమని ముందస్తుగా ఇండికేషన్ ఇస్తున్నది. ఇప్పటికే నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్​ రేవంత్ ​సొంత టీం దాదాపుగా రెడీ అయింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వారి వివరాలన్నీ సేకరించారు. ప్రజల్లో సానుభూతి, నిత్యం జనంతో మమేకమవటం, సమస్యలపై స్పందించేతత్వం, పార్టీ డిజిటల్​ మెంబర్​షిప్‌లో లక్ష్యాన్ని చేరుకోవడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న వారిని పోటీకి దింపేందుకు వ్యూహం రచిస్తున్నది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి పీసీసీచీఫ్​ రేవంత్ ​హామీ సైతం తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే కొందరు టీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ముఖ్యులతో టచ్ లో ఉన్నారు. తమ పార్టీలో టికెట్ రాకుంటే కాంగ్రెస్ లో చేరి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది.

టికెట్ రాకుంటే జంప్

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి. అందుకే ఈ విషయంలో పార్టీలన్ని స్పీడ్ పెంచాయి. గులాబీ అధినేత జాతీయ రాజకీయాల రాగం అందుకున్నారు. రాష్ట్రంలోనూ పార్టీ, ప్రజాప్రతినిధుల పరిస్థితిపై సర్వేలు చేయిస్తున్నారు. పీకే టీం సైతం రంగంలోకి దిగి పరిస్థితులను ఆరా తీస్తున్నది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా పని చేసిన వారిపై స్థానికంగా వ్యతిరేకత పెరిగిందని తేలింది. వీటితో పాటు దళితబంధు ఎంపికలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి బహిర్గతమవుతున్నది. అలాంటి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తన అభ్యర్థులను మార్చే చాన్స్ ఉంది. ఈ క్రమంలో తమకు టికెట్ రాకుంటే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయి టికెట్ దక్కించుకోవాలని కొందరు నేతలు భావిస్తున్నారు. అందుకే ముందస్తుగానే కాంగ్రెస్ నేతలకు టచ్‌లో ఉంటున్నారు.

అనుభవాలను గుర్తుంచుకొని

2018 ఎన్నికలతో పాటు, దుబ్బాక ఉపఎన్నికలో ఇతర పార్టీలోంచి కాంగ్రెస్ లో చేరిన వారికి టికెట్ ఇచ్చి ఓడిపోయిన అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ నుంచి​టికెట్​ఆశించి భంగపడిన శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీఆర్‌ఎస్ వ్యతిరేకత, మల్లన్నసాగర్​ బాధితులతో కొంత ఓటు బ్యాంకు వస్తుందని, రెండో స్థానంలో నిలుస్తామని కాంగ్రెస్ భావించింది. కానీ, సొంతపార్టీలోనే నేతలు ఎదురుతిరిగారు. టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి​ టికెట్​ ఎలా ఇచ్చారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని ప్రభావం ఓట్లపై స్పష్టంగా కనిపించింది. ఇకపై అలాంటి పరిస్థితి రావద్దనే కాంగ్రెస్​పార్టీ ఈసారి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నది.

అభ్యర్థులు ఖరారంటూ సంకేతాలు..

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ​అభ్యర్థులు ఖరారయ్యారంటూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సంకేతాలు ఇవ్వాలని రేవంత్ బృందం నిర్ణయం తీసుకుంది. అటు ఏఐసీసీ నుంచి కూడా పూర్తిస్థాయి అండదండలు ఉండటం, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్​కూడా పలు సందర్భాల్లో ఏదైనా రేవంత్‌దే తుది నిర్ణయం అంటుడటం విశేషం. దీంతో టీపీసీసీ చీఫ్​ దూకుడు పెంచుతున్నారు. ముందు నుంచీ నియోజకవర్గాల్లో ఉంటూ, పార్టీ కోసం పని చేస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల సమయంలో ఆర్థిక లావాదేవీలపైనా ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నట్టు గాంధీభవన్​వర్గాల్లో టాక్​నడుస్తున్నది. ఓటర్ల మద్దతు కూడబెట్టుకుంటూనే ఎన్నికల్లో ఆర్థికంగా తట్టుకుని నిలబడే నేతలను సెగ్మెంట్ల వారీగా ముందుకు తీసుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రేవంత్ వర్గమే పోటీలో ఉంటుందని వర్గాలో ప్రచారం జరుగుతున్నది.

Advertisement

Next Story