Telangana Budget- 2023: విద్యారంగానికి రూ.19,093 కోట్లు

by Satheesh |   ( Updated:2023-02-06 13:17:07.0  )
Telangana Budget- 2023: విద్యారంగానికి రూ.19,093 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం 2023‌‌ -24 బడ్జెట్​లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. గతంలో కంటే అధికంగా నిధులు కేటాయింపులు చేపట్టింది. విద్యారంగానికి రూ.19,093 కోట్లు కేటాయించింది. ఇందులో సెకండరీ విద్యకే రూ.16,0962 కోట్లు కేటాయించింది. ఉన్నత విద్యకు రూ.3001 కోట్లు కేటాయించింది. గతేడాది రాష్ట్ర బడ్జెట్​లో రూ.16085 కోట్లను తెలంగాణ సర్కార్ కేటాయించింది. ఈసారి గతంతో పోలిస్తే రూ.3008 కోట్లు అదనంగా అందించింది. ఇదిలా ఉండగా రాష్ట్రం ఏర్పడిన సమయంలో 293 గురుకులాలుండగా నేడు వాటి సంఖ్యను 1002కు పెంచారు. గతంలో లక్షన్నర మంది విద్యార్థులుంటే నేడు ఆ సంఖ్య 5.59 లక్షలకు పెరిగింది.

ఉన్నత విద్యకు రూ.3001 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యకు రూ.3001 కోట్లు కేటాయించింది. గతేడాది ఉన్నత విద్యకు రూ.2357 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. కాగా తాజాగా బడ్జెట్ లో అదనంగా రూ.644 కోట్లు కేటాయింపులు చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టల్ భవనాల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం కోసం ఈ బడ్జెట్ లో రూ.500 కోట్లు ప్రతిపాదించింది. వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కోసం ఇంత మొత్తంలో కేటాయించడంతో ఇదే మొదటిసారి.

ఊసేలేని 'మన ఊరు‌‌-మన బడి'‌

తెలంగాణ సర్కార్ ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు ప్రతిష్టాత్మకంగా గతేడాది 'మన ఊరు‌‌-మన బడి'‌ పథకానికి శ్రీకారం చుట్టింది. దశలవారీగా అభివృద్ధి చేపట్టాలని భావించింది. కానీ ఈసారి బడ్జెట్ లో ఏమాత్రం నిధులు కేటాయించడలేదు. పేదలకు ఇంగ్లిష్​లో విద్యాబోధన చేపట్టడమే కాకుండా పాఠశాలల అభవృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో మన ఊరు‌‌-మనబడి‌‌, పట్టణ ప్రాంతాల్లో మన బస్తీ‌‌-మనబడి‌‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది. 12 రకాల మౌలిక అంశాలను పొందుపరిచి అభివృద్ధి చేపట్టాలని సర్కార్ భావించింది. అందుకుగాను మొత్తం రూ.7,289 కోట్లు కేటాయిస్తున్నట్లు సర్కార్ గతేడాది చెప్పింది. మొత్తం 26,065 పాఠశాలలను మూడు దశల్లో అభివృద్ధి చేపట్టాలని డిసైడ్ అయింది. తొలి విడుతలో భాగంగా 9123 స్కూళ్లలో రూ.3497 కోట్లతో మౌలిక సదుపాయలు కల్పించాలని చూసింది. అయితే ఇందులో ఎన్ని స్కూళ్లు అభివృద్ధి చేపట్టామనే విషయాలను సర్కార్ ఇప్పటి వరకు అధికారికంగా తెలపలేదు. ఈనెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పనులు పూర్తయిన పాఠశాలలను ప్రారంభించాలని ఆదేశించినా ఇప్పటికీ ఎన్ని స్కూళ్లు ప్రారంభించారనే అంశాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

మహిళా, ఫారెస్ట్ వర్సిటీకి నిల్

తెలంగాణలో మహిళా, ఫారెస్ట్​వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం గతేడాది గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉంచేందుకు రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిష్టాత్మంగా తీసుకుంది. కోటి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా ప్రకటించింది. గత బడ్జెట్‌లో మహిళా వర్సిటీ, ములుగు ఫారెస్ట్ వర్సిటీకి కలిపి మొత్తం రూ.100 కోట్లు ప్రతిపాదించింది. కానీ ఇప్పటి వరకు ఏర్పాటు విషయంలో ముందడుగు పడలేదు.

కొత్తగా 5 కాలేజీలు

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రెండు పాలిటెక్నిక్, రెండు ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 14 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసింది. కాగా 2023-24 విద్యాసంవత్సరంలో భాగంగా మరో రెండు కాలేజీలు ఏర్పాటు చేయనుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఒకటి, భద్రాద్రి జిల్లా మణుగూరులో ఒక పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభించనుంది. జేఎన్ టీయూ పరిధిలో 2 కొత్త కాలేజీలను తెలంగాణ సర్కార్ నిర్మించనుంది. మహబూబ్ నగర్‌లో, కొత్తగూడెంలో వీటిని నిర్మించనుంది.

ఉపాధ్యాయ సంఘాల ఫైర్

విద్యాశాఖకు కేటాయించిన బడ్జెట్‌పై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం బట్జెట్‌లో విద్యాశాఖను కేవలం 6.57 శాతమే కేటాయించడంపై తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు 10 శాతం బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంత తక్కువ మొత్తంలో కేటాయించడంపై విమర్శలు చేస్తున్నారు. ఉన్నత విద్యకు రూ.3001 కోట్లు కేటాయిస్తే అందులోంచి రూ.500 కోట్లు వర్సిటీలకు ఇవ్వడమంటే కేవలం నామమాత్రపు బడ్జెట్‌గా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మన ఊరు-మన బడి పథకానికి అసలు నిధులు కూడా కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read More..

Telangana Budget 2023: షెడ్యూల్ కులాల డెవలప్‌మెంట్‌కు కేటాయింపులివే!

Advertisement

Next Story