‘ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిల‌బెట్టిన చ‌రిత్ర టీడీపీది’

by GSrikanth |
‘ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిల‌బెట్టిన చ‌రిత్ర టీడీపీది’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్వేష రాజ‌కీయాల‌కు ముగింపు ప‌ల‌కాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయ‌క‌త్వంలో సంక్షేమ పాల‌న‌కు తెర‌లేపి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిల‌బెట్టిన చ‌రిత్ర తెలుగుదేశం పార్టీద‌ని, అలాంటి సుప‌రిపాల‌న రావాలంటే అన్నివ‌ర్గాల ప్రజ‌లు ఆ పార్టీకి మ‌ద్దతు ప‌లుకాల‌ని పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ సోష‌ల్ మీడియా కో-అర్డినేట‌ర్ ఎస్‌.మాస‌య్య ఆధ్వర్యంలో ప‌రిగి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం చౌడాపూర్ మండ‌లానికి చెందిన పది మంది కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన యూత్ నాయ‌కులు పార్టీలో చేరారు.

వీరికి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌, పొలిట్‌బ్యూరో స‌భ్యుడు రావుల చంద్రశేఖ‌ర్‌రెడ్డి ప‌చ్చ జెండాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను మ‌రిచి అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు అప్పులు చేస్తూ ప్రజ‌ల‌ను వంచిస్తున్న ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజ‌కీయ పార్టీల మోసాన్ని గ్రహించక‌పోతే రాబోయే రోజుల్లో పెను ప్రమాదం త‌ప్పద‌న్నారు. గ‌త పాల‌కులు నైతిక విలువల‌తో పాల‌న సాగిస్తే నేటి పాల‌కులు త‌మ అధికారాన్ని శాశ్వతంగా నిలుపుకోవాల‌ని, రాజ్యాంగ సూత్రాల‌ను సైతం ఉల్లంఘించి ప్రతిప‌క్ష పార్టీల గొంతునులిమి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు.

ఈ దారుణ రాజ‌కీయ ప‌రిస్థితులు పోయి ప్రజాస్వామ్యయుత‌, సామ‌ర‌స్య సుప‌రిపాల‌న మ‌ర‌లా రావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమ‌న్నారు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.మాసయ్య, చౌడాపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు చెందిన యూత్ నాయకులు జీ.నర్సింహా, ఎస్. శేఖర్, ఎస్.రవి, కే. రామస్వామి, ఎస్. అంజయ్య, ఎన్.హరీష్, ఈ రామస్వామి, ఎస్ పవన్, శ్రీను తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయ‌కుడు కాసాని వీరేష్‌, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేట‌ర్ బియ్యని సురేష్‌, నాయ‌కులు ఆరీఫ్‌, చిరంజీవి రాజు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed