ఎన్నికల సైరన్ మోగించేందుకు సిద్ధమైన T- బీజేపీ.. కనీవినీ ఎరుగని రీతిలో సభకు ప్లాన్..!

by Satheesh |   ( Updated:2023-07-03 06:49:51.0  )
ఎన్నికల సైరన్ మోగించేందుకు సిద్ధమైన T- బీజేపీ.. కనీవినీ ఎరుగని రీతిలో సభకు ప్లాన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇస్తూ ఎన్నికల సమరశంఖాన్ని పూరించింది. బీజేపీ సైతం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఓరుగల్లు వేదికగా ప్రధాని మోడీ సభతో ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

ఈనెల 8వ తేదీన మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ వేదికగా భారీ బహిరంగ సభ ద్వారా తమ సత్తా చాటబోతున్నారు. సభకు ‘విజయ సంకల్ప సభ’ అని నామకరణం చేశారు. గతేడాది సికింద్రాబాద్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభ సక్సెస్ అయిన విధంగానే ఈ సభను కూడా కాషాయ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

ఒక్కో జిల్లా నుంచి 40వేల మంది..

లక్ష్యంగా అన్ని జిల్లాల నుంచి శ్రేణులను తరలించాలని నిర్ణయించారు. ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో సభ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం డిసైడ్ అయింది. ఒక్కో జిల్లా నుంచి కనీసం 40 వేల మందిని సభకు తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం పార్టీ ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించనుంది.

పని విభజన చేసుకుని ఎవరికి అప్పగించిన పనులు వారు చేపట్టేలా ప్లాన్ చేసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల మధ్య సమన్వయం కొరవడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మోడీ తెలంగాణ విజిట్‌కు సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్ ఇంకా ఫిక్స్ కాకపోయినా బీజేపీ నేతలు మాత్రం ఉదయం 9 గంటలకే ఉంటుందని స్పష్టం చేశారు.

ఉదయమే సభ ఉండటంతో జన సమీకరణ విషయంలో ఫెయిల్ కావొద్దని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. బీఆర్ఎస్‌కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీయేననే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ఇప్పటికే ఈ సభను సక్సెస్ చేసేందుకు సన్నాహక సమావేశాన్ని సైతం నిర్వహించింది. నేతలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు.

సత్తా చాటేలా..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ చాలా వీక్‌గా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో నేతలెవరూ అక్కడ లేకపోవడం మైనస్. అందుకే ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో అక్కడ తమ సత్తా ఏంటో చాటాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రత్యర్థి పార్టీలకు తమ బలాన్ని చూపాలని డిసైడ్ అయింది. ఇదిలా ఉండగా గతంలో ఇదే ఆర్ట్స్ కాలేజీ వేదికగా దాదాపు 2 లక్షల మందితో కాంగ్రెస్ ‘రైతు డిక్లరేషన్’ను ప్రకటించింది.

ఇప్పుడు అదే గడ్డ నుంచి బీజేపీ సమరశంఖం పూరించేందుకు సిద్ధమైంది. ఈ సభతో కొద్దిరోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. అంతేకాకుండా బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనన్న సంకేతాలు వెళ్లడంతో అలర్ట్ అయిన కాషాయ పార్టీ ఆ మరకను తుడిచేసుకోవాలని చూస్తోంది. ఓరుగల్లు నుంచి ఎన్నికల సమరశంఖాన్ని పూరించాలనుకుంటున్న బీజేపీ వ్యూహం సక్సెస్ అవుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Read More: ‘కమల’ దళపతిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ.. BJP హై కమాండ్ నిర్ణయంపై స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ.

T-బీజేపీలో కీలక పరిణామం.. హైకమాండ్ నుండి రఘునందన్ రావు, కొండాకు పిలుపు


Advertisement

Next Story

Most Viewed