'తన్నీరు' స్కెచ్.. మురళికి చెక్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-14 02:49:43.0  )
తన్నీరు స్కెచ్.. మురళికి చెక్!
X

దిశ బ్యూరో, సంగారెడ్డి : ట్రబుల్ షూటర్ హరీష్ రావు నర్సాపూర్‌పై నజర్ పెట్టారు. నర్సాపూర్‌కు చెందిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రగొళ్ల మురళీయాదవ్ కొద్ది రోజుల క్రితం బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాను చేరడమే కాకుండా ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులను బీజేపీలో చేర్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇది గుర్తించిన జిల్లా మంత్రి హరీష్ రావు మురళీయాదవ్‌కు చెక్ పెట్టే రాజకీయం స్టార్ట్ చేశారు. మున్సిపల్ చైర్మన్‌గా మురళీయాదవ్ చేపట్టిన బిల్లులు అందకపోవడం, ఇప్పటికే తాను అమ్మినట్లుగా ఆరోపణలున్న భూమిని స్వాధీనం చేసుకోవడం వంటివి వెంటవెంటనే జరిగిపోగా ఇప్పుడు చైర్మన్ పదవికే ఎసరు వచ్చింది. ఆయనపై కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం పెట్టారు. దీనితో నర్సాపూర్‌లో ఆసక్తికర రాజకీయం నెలకొన్నది...

బీసీలకు న్యాయం జరగలేదని..

పార్టీ కోసం కష్టపడుతున్నప్పటికీ బీఆర్ఎస్‌లో బీసీలకు పదవుల విషయంలో న్యాయం జరగలేదని ఆరోపిస్తూ మురళీయాదవ్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఆయన, ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా అతని సతీమణి రాజమణి బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.

తనకు కాకుండా ఉమ్మడి జిల్లాలో చాలా మంది అర్హులైన పార్టీ నాయకులు ఉన్నప్పటికీ పదవులు మాత్రం ఇవ్వలేదని ఆయన మీడియా ముందు ఆరోపణలు చేశారు. పద్మ దేవేందర్ రెడ్డి, చింతా ప్రభాకర్ వంటి వారు కూడా తీవ్ర అన్యాయానికి గురయ్యారన్నారు. మురళీయాదవ్ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం కూడా తెలిసిందే. ఆయనతో పాటు నర్సాపూర్ నుంచి కొందరు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్‌గా కొనసాగుతున్న ఆయన బీజేపీ పార్టీ తరపున పనిచేస్తున్నారు.

బీజేపీలోకి వలసలు ప్రోత్సహిస్తూ..

బీజేపీలోకి వెళ్లిన మురళీయాదవ్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్, జహీరాబాద్, పటాన్ చెరు, మెదక్, నర్సాపూర్ వంటి ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ చెందిన వారిని బీజేపీలోకి చేర్పించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గజ్వేల్‌కు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్‌ను కూడా బీజేపీలోకి చేర్పించే ప్రయత్నాలు చేశారు. రోజువారిగా బీజేపీ నేత ఈటల రాజేందర్ వద్దకు వెలుతూ ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటూ చేరికలపై ప్రధాన దృష్టి పెట్టారు.

తన చేరిక సమయంలో కూడా నర్సాపూర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి హంగమా చేసే ప్రయత్నం చేశారు. తాను పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులను టీఆర్ఎస్‌లో చేర్పిస్తానని సన్నిహితులు, బీజేపీ రాష్ట్ర నాయకుల వద్ద కూడా చెప్పకున్నాడు. ఆయన చేరిన మొదట్లో జిల్లాలో పార్టీలో కొంత ఊపు కనిపించింది.

రంగంలోకి మంత్రి హరీష్ రావు...

ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ వాళ్లను బీజేపీలో చేర్పించడానికి మురళీయాదవ్ ప్రయత్నిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు గుర్తించారు. ఆయన సన్నిహితులు కూడా ఇదే విషయం చెప్పారు. దీనితో ఆయనే స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇందులో భాగంగానే నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డితో చర్చలు జరిపారు. బీజేపీలో చేరిన సందర్భంగా మంత్రి హరీష్ రావుపై కూడా మురళీయాదవ్ విమర్శలు చేశారు. దీంతో మంత్రి మురళీ యాదవ్‌కు చెక్ పెట్టారు.

ఇందులో భాగంగానే నర్సాపూర్ పట్టణంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఓ స్థలాన్ని మురళీయాదవ్ మరొకరికి అమ్మినట్లగా ఆరోపణలున్నట్లు తెలుసుకుని ఆ స్థలాన్ని ఇటీవలే అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూమి బోర్డులు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆర్టీసీ సంస్థకు చెందిన పెట్రోల్ బంక్ మురళీయాదవ్ నిర్వహణలో ఉండగా దానిని కూడా ఆర్టీసీ నిర్వహణలోకి తీసుకువచ్చారు. మున్సిపల్ చైర్మన్‌గా తాను చేపట్టిన బిల్లులకు కూడా రావడం లేదని మురళీ యాదవే స్వయంగా మీడియా ముందు చెప్పుకుని ఆందోళన చెందిన విషయం తెలిసిందే. మొత్తంగా నర్సాపూర్‌లో మురళీయాదవ్‌ను అష్టదిగ్భందనం చేశారని చెప్పుకోవచ్చు.

చైర్మన్ సీటుకే ఎసరు..

నర్సాపూర్‌లో మురళీయాదవ్ ఆర్థిక మూలాలను దెబ్బ తీసిన పార్టీ అధిష్టానం ఇప్పుడు తన చైర్మన్ పదవికే ఎసరు పెట్టారు. మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులుండగా కౌన్సిలర్లు మంత్రితో సహా, ఎమ్మెల్యేను కలిసి నేరుగా వెళ్లి మెదక్ కలెక్టర్‌కు అవిశ్వాసం తీర్మానపత్రం అందించారు. ఎట్టి పరిస్థితుల్లో మురళీయాదవ్ దిగిపోవాలని కౌన్సిలర్లు శపథం చేశారు. తన చుట్టూ చక్రబంధం వేసిన నేపథ్యంలో మురళీయాదవ్ కూడా ఈ మద్య బీజేపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.

ఎక్కడ కూడా పెద్దగా ఉత్సాహంగా కనపించడం లేదు. అంటే అనవసరంగా బీజేపీలో చేరాననే విధంగా ఆయన ఇబ్బంది పడుతున్నట్లు నర్సాపూర్‌లో చర్చ జరుగుతోంది. చేరిన మొదట్లో ఎక్కడా బీజేపీ మీటింగ్ జరిగినా కనిపించిన మురళీయాదవ్ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. వరుసగా జరుగుతున్న పరిణామాలు చూసి ఆయన సన్నిహితులు కూడా ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నర్సాపూర్ లో ఏం జరుగనున్నదో అని ఆసక్తి నెలకొన్నది. మురళీ యాదవ్ పదవిలో ఉంటారా..? దింపేస్తారా..? అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story