వాళ్లందరికి పదోన్నతి కల్పించాలి: సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ

by Satheesh |
వాళ్లందరికి పదోన్నతి కల్పించాలి: సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: యూనివర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం లెక్చరర్లకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌(సీ)గా పదోన్నతులు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో సుమారు 755 మంది పార్ట్‌ టైమ్‌ లెక్చరర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ఓయూలో 427 మంది, కాకతీయ వర్సిటీలో 180, మహాత్మాగాంధీలో 28, తెలంగాణ యూనివర్సిటీలో 48, పాలమూరు యూనివర్సిటీలో 52, శాతావాహన యూనివర్సింటీలో 20 మంది పార్ట్‌టైం లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. వీరందరినీ సంబంధిత కళాశాల ప్రిన్సిపల్‌ అధ్యక్షతన సెలక్షన్‌ కమిటీ పార్ట్‌టైం లెక్చరర్స్‌గా ఎంపిక చేసిందని వివరించారు.

వర్క్‌లోడ్‌, సరిపడా క్లాసులు లేవనే సాకుతో వీరిని పార్ట్‌టైమ్ ప్రాతిపదికనే కొనసాగిస్తున్నారని, వాస్తవాన్ని పరిశీలిస్తే వివిధ విభాగాల్లో రెగ్యులర్‌ ప్రొఫెసర్ల పదవీ విరమణ వల్ల వీరిపై తీవ్ర పనిభారం పెరిగింది తప్ప, తగ్గలేదని పేర్కొన్నారు. వీరంతా ఉస్మానియా యూనివర్సిటీ రూపొందించిన సెలక్షన్‌ కమిటీ ద్వారానే నియమించబడ్డారని, తగిన అర్హతలన్నీ కలిగి ఉన్నారని తెలిపారు. కాబట్టి వారానికి 16 గంటల వర్క్‌లోడ్‌ ఉన్నచోట పార్ట్‌ టైం లెక్చరర్లుగా పని చేస్తున్నవారందరికీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ (సీ)గా పదోన్నతి కల్పించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని లేఖలో కోరారు.

Advertisement

Next Story