రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు T-బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక హామీ

by Satheesh |
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు T-బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని, బీజేపీని అధికారంలోకి తేవాలనుకుంటున్నారని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ పవర్‌లోకి రాగానే ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తామని, నెల రోజుల వ్యవధిలోనే పెండింగ్ డీఏలను చెల్లిస్తామని, జీవో 317ను సవరిస్తామని, స్థానిక ఆధారంగా బదిలీ మెకానిజాన్ని రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కసితో బీఆర్ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. కొంపల్లిలో జరిగిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో గురువారం రాత్రి పలు సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగడానికి అలవాటు పడిన ఎన్జీవో లీడర్లు ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేశారని అన్నారు. క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై కనీసం చర్చించలేదని గుర్తుచేశారు.

బీజేపీ పవర్‌లోకి రాగానే వేతన సవరణ సంఘాన్ని నియమిస్తామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లాగైనా గెలవాలని బీఆర్ఎస్ ఒక్కో ఓటుకు రూ. 20 వేల చొప్పున వెల కడుతున్నదని, టీచర్ల గౌరవాన్ని కించపరుస్తున్నదన్నారు. టీచర్ల సంఘానికి ఐదు కోట్ల రూపాయలతో కొనాలని ప్రయత్నిస్తునదని ఆరోపించారు. మరోసారి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిస్తే ఆ అహంతో టీచర్లను కేసీఆర్ ఇంకా ఘోరంగా అవమానిస్తారని అన్నారు.

జీతాలు ఎంత లేటుగా ఇచ్చినా నోరెత్తలేరనే గర్వం తలకెక్కుతుందన్నారు. ఓటు వేసే ముందు కేసీఆర్ ట్రీట్‌మెంట్‌తో బాధలు పడ్డ ఉపాధ్యాయులు ఆలోచించుకోవాలని, ఎన్నికల్లో బీజేపీని గెలిపించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయులకు సంబంధించినవి మాత్రమే కావని, తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్దేశించేవన్నారు.

లిక్కర్ దందాలో వేలు పెట్టిన కవిత తెలంగాణ ప్రజల పరువు తీశారని ఆరోపించారు. ఆమె ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదని గుర్తుచేశారు. పార్లమెంటులో మహిళా బిల్లు కాపీలను చించేసిన సమాజ్‌వాదీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని ఇప్పుడు జంతర్‌మంతర్‌లో మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు.

మహిళా బిల్లుపై ఆమె చేస్తున్న దీక్షను చూసి జనం నవ్వుకుంటున్నారని గుర్తుచేశారు. దొంగ సారా దందాతో తెలంగాణ మహిళలు, ప్రజలు తలదించుకునే దుస్థితి వచ్చిందన్నారు. కవిత మీద ఈడీ, సీబీఐ విచారణలు జరుగుతుంటే స్పందించిన కేసీఆర్ సొంత పార్టీ నేతల మీద ఆరోపణలు వస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న, కేసీఆర్ అవినీతిని, వైఫల్యాలను ఎదిరిస్తున్న తనపైన 18 మంది ఇంటెలిజెన్స్ నిఘా కొనసాగుతున్నదన్నారు. గతంలో ముఖ్యమంత్రి ఒక హామీ ఇస్తే కచ్చితంగా అమలయ్యేదని ప్రజలు భావించేవారని, కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ నోట ఏ మాట వచ్చినా అంతే సంగతులన్నారు. పంజాబ్ రైతులకు చెక్కులు పంచితే అవి చెల్లలేదన్నారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఏడేండ్లుగా ఇవ్వలేనోడు ఇప్పుడు సొంత జాగ ఉంటే ఇల్లు కట్టుకోడానికి రూ. 3 లక్షల చొప్పున నాలుగు లక్షల మందికి సాయం చేస్తాడంట.. అని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగమంటూ హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేదన్నారు. దళితబంధు, రుణమాఫీ, ఉచిత యూరియా, నిరుద్యోగ భృతి లాంటి హామీలు బుట్టదాఖలా అయ్యాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు మద్యం ద్వారా రూ. 10 వేల కోట్ల ఆదాయం ఖజానాకు సమకూరితే కేసీఆర్ పాలనలో మద్యం ఏరులై పారుతున్నదని, ఏటా రూ.40 వేల కోట్లు ఆదాయం వస్తున్నదన్నారు. అయినా ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని దుస్థితి నెలకొన్నదన్నారు. అయినా అప్పులు మాత్రం ఐదు లక్షల కోట్ల రూపాయలు దాటిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed