రాంచరణ్​ ప్రమోషన్ వీడియోలతో సువర్ణభూమి ‘రియల్’ బిజినెస్!

by GSrikanth |   ( Updated:2023-05-27 06:33:05.0  )
రాంచరణ్​ ప్రమోషన్ వీడియోలతో సువర్ణభూమి ‘రియల్’ బిజినెస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఒక్కసారి పెట్టుబడి పెట్టండి. బహుళ ప్రయోజనాలు పొందుతారు.. సువర్ణ సహజలో సహజసిద్ధంగా వెదురు, మట్టితో ఇల్లు కట్టుకోవచ్చు. అనుభవజ్ఞులైన ఆర్కిటెక్ట్స్ ప్లానింగ్ ఇస్తారు. పంచభూతాలతో పాజిటివ్ వైబ్రేషన్స్ పొందుతారు. చెక్కతోనూ కట్టుకోవడానికి ప్లానింగ్స్ ఉన్నాయి. వీకెండ్‌లో ఎంజాయ్ చేయొచ్చు’ = హీరో రాంచరణ్.

చిరంజీవి కొడుకు, నటుడిగా అందరికీ తెలుసు. ఆయన మాట్లాడినట్లుగా, ఆయన తమ అంబాసిడర్‌గా ప్రచారం చేస్తున్నారు. పైగా 30 ఏండ్ల అనుభవం. 45 దేశాల్లో పని, 96 కంపెనీలతో కలిసి పని చేసిన అనుభవం, 215 సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన ఘనత. ఐతేనేం.. వెంచర్లు వేస్తాం.. రోడ్లు వేస్తాం. క్లబ్ హౌజ్‌లు నిర్మిస్తాం. గజాల్లో డబ్బులు కలెక్ట్ చేస్తాం. గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తాం.. ఇదీ గ్రేట్ సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ పని. ఇండస్ట్రీయల్ బిల్డింగ్, కార్పొరేట్ బిల్డింగ్, మెటల్ వర్క్స్‌లోనూ సుదీర్ఘ అనుభవం. ఐతేనేం..? పటాన్ చెరు, గాగిల్లాపూర్, షాద్ నగర్, కొత్తూరు, ఇప్పలపల్లి, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో అనేక వెంచర్లు చేసి అమ్మేస్తున్నది.

కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ బ్రోచర్లు పంపిణీ చేస్తున్నది. హీరో రాంచరణ్​ప్రమోషన్ వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. రోడ్లు వేశారు. కరెంటు సప్లై ఇచ్చారు. క్లబ్ హౌజ్ లు నిర్మిస్తున్నారు. అన్నీ చేసినా వెంచర్లుగా కాకుండా ఫామ్ హౌజ్ ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. దీనికి ట్రెడా, క్రెడాయ్ వంటి సంస్థల్లో మెంబర్లమంటూ బ్రోచర్లల్లో ప్రధానంగా ముద్రిస్తున్నారు. ఇంత అనుభవం కలిగిన సంస్థ లే అవుట్ డెవలప్ చేసి అనుమతులు తీసుకోకుండా ఫామ్ ప్లాట్ల పేరిట దందా నిర్వహిస్తుండడం అనుమానాలు కలిగిస్తున్నది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో ఫామ్ ప్లాట్ల దందాను సువర్ణ భూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ చేస్తున్నది.

అనుమతులు వద్దా?

సువర్ణ సాకేత్ పేరిట మోమిన్ పేటలో 400 ఎకరాల మెగా ప్రాజెక్టు అంటూ రాంచరణ్ ఫోటోలతో బ్రోచర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. గజం ధర రూ.5 వేలుగా నిర్ణయించారు. పటాన్ చెరులో 80 ఎకరాలతో సువర్ణ సహజ పేరిట మూడు గుంటల ప్లాట్లను విక్రయిస్తున్నారు. గజం ధర రూ.10 వేలు. పటాన్ చెరు దౌల్తాబాద్ లో గజం రూ.12 వేలుగా పెట్టి ఫామ్ ల్యాండ్ ప్లాట్లను అమ్ముతున్నారు. సదాశివపేటలో డీటీసీపీ లే అవుట్ అంటూ గజం ధర రూ.22 వేలుగా పెట్టారు. పటాన్ చెరు మడలం చింతలచెరులో హెచ్ఎండీఏ వెంచర్ అంటూ గజం ధర రూ.16 వేలుగా పెట్టి అమ్మేస్తున్నారు. ఇలా హెచ్ఎండీఏ, డీటీసీపీ లే అవుట్లంటూ జనాన్ని కన్ఫూజ్ చేస్తున్నారు. ఇంతకీ ఏ వెంచర్లకు అనుమతులు ఉన్నాయి? ఎన్ని ఎకరాలకు తీసుకున్నారు? ఎన్ని ఎకరాల్లో వెంచర్లు చేశారు? లే అవుట్లుగా తీర్చిదిద్ది, క్లబ్ హౌజ్ లు, పార్కులు నిర్మించి ఫామ్ హౌజ్ ప్లాట్లు అంటూ గజాల్లో డబ్బులు తీసుకొని గుంటల్లో ఎందుకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి వాటికి కూడా అనుమతులు తీసుకొని విక్రయించడం ద్వారా కంపెనీకి వచ్చే నష్టాలేమిటో అర్ధం కావడం లేదు.

అన్నీ ఇంటికే

కూరగాయలు పండించి ఇంటికి పంపిస్తం. మామిడి, సపోటా ఇంటికే తెచ్చి ఇస్తాం. మూడేండ్లు మేమే వ్యవసాయం చేస్తాం. మెయింటెనెన్స్ మాదే. మూడున్నర ఎకరాల్లో క్లబ్ హౌజ్ కడుతున్నాం. విలేజ్ స్టయిల్ లో రెస్టారెంట్ ఉంటుంది. స్పా, యోగా సెంటర్లు ఉంటాయి. బంక్విట్ హాల్స్ ఉంటాయి. పార్టీ చేసుకోవచ్చు. మినీ థియేటర్ కూడా నిర్మిస్తాం.. ఒక్కటేమిటి.. ఫామ్ ప్లాట్లలోనూ విల్లాలకు మాదిరిగా సౌకర్యాలు కల్పిస్తామంటూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. 500 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ కి అత్యంత సమీపంలోనే ఉంటుంది. ఔటర్ దిగితే 15 నిమిషాల్లో చేరుకోవచ్చు.

ఎందుకింత రేట్?

మోమిన్ పేట్ లో సువర్ణ సాకేత్ ప్రాజెక్టులో బై బ్యాక్ ఆఫర్ కింద ఎకరం ధర రూ.80 లక్షలు, అర ఎకరం రూ.40 లక్షలుగా పెట్టారు. ఐతే 18 నెలల కాలంలోనే రూ.1.20 కోట్లు, రూ.60 లక్షలు రిటర్న్ తీసుకోవచ్చని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా ప్లాట్లు అమ్మేసినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అలాగే ఎల్లాపూర్ లో సువర్ణ లేక్ వ్యూ ప్రాజెక్టు కింద 363 గజాలకు రూ.25,40,637, 605 గజాలకు రూ.42,34,395, 726 గజాలకు రూ.50,81,274 లుగా ధరలు పెట్టారు. రిజిస్ట్రేషన్ ఏడు రోజుల్లో చేసుకుంటే గజం రూ.10 వేలు, 45 రోజుల్లో చేసుకుంటే రూ.10,500, 90 రోజుల్లో చేసుకుంటే రూ.11 వేలు అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. మోమిన్ పేటలో ఎకరం ధర కేవలం రూ.3.75 లక్షలే. మార్కెట్ ధర ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వీళ్లేమో ధరలను ఎంతగా పెంచేశారో చూడొచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ ధరలకు, విక్రయిస్తున్న ప్లాట్ల ధరలకు మధ్య అంతులేని వ్యత్యాసం ఉన్నది. దీన్ని బట్టి స్టాంప్ డ్యూటీ ఎగవేతకు అవకాశం ఏర్పడింది. పైగా కస్టమర్ల దగ్గర తీసుకుంటున్న సొమ్ముకు, రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ లో పేర్కొన్న ధరకు పోలికే లేదు. ఇప్పటికే రూ.వందలాది ఎకరాలు అమ్మేసిన కంపెనీ ఎన్ని రూ.కోట్లు కూడబెట్టిందో లెక్కలు కట్టొచ్చు.

దారులేవి?

ఉదాహరణకు వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం రాంనాధ్​గూడపల్లిలో హైదరాబాద్​కి చెందిన ఓ కస్టమర్ కి సర్వే నం.67లో 5 గుంటల ప్లాట్ ని అమ్మారు. సేల్ డీడ్ ప్రకారం దాని ధర కేవలం రూ.29 వేలు మాత్రమే. దీనికి గాను కేవలం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చార్జీల కింద చాలాన్ ద్వారా రూ.2838 మాత్రమే చెల్లించారు. పైగా ఆ ప్లాట్ కి రోడ్డు కూడా లేదు. అన్ని వైపులా పక్కోళ్ల భూమిగానే పేర్కొన్నారు. ఎక్కడైనా ప్లాట్, వ్యవసాయ భూమి ఉంటే దానికి ఏదో ఒక వైపు బాట ఉండాలి. అలాంటిదేం లేకుండానే అమ్ముతున్నారు. ఒకవేళ సదరు వ్యక్తి ప్లాట్ అమ్ముకోవాలంటే మరొకరు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రారు. తిరిగి కంపెనీకి మాత్రమే అమ్మాల్సి వస్తుంది. లే అవుట్ లో మాత్రం రోడ్డు చూపిస్తున్నారు. అమ్మేటప్పుడు మాత్రం సేల్ డీడ్ లో రోడ్డు చూపించకపోవడం వెనుక పెద్ద మతలబు ఉన్నది. ఏ కస్టమరైనా కంపెనీ చేతిలోనే ఉండేందుకు వ్యూహంగా కనిపిస్తున్నది.

ఇంత భూమి ఉన్నదా?

సువర్ణ భూమి కంపెనీ పేరిట ఏ ప్రాజెక్టు చూసినా వందల ఎకరాలే ఉన్నది. ఫామ్ ప్లాట్ల అమ్మకాల్లో సేల్ డీడ్స్ లో మాత్రం కంపెనీకి ఆ స్థాయిలో భూములే లేవని తెలుస్తున్నది. మరి రైతుల దగ్గర నుంచి ఎవరు కొనుగోలు చేశారు? ఎంతకి కొన్నారు? ఎంతకు అమ్మేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో లే అవుట్లుగా పేర్కొన్న ప్లాట్లను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ప్రతి అధికారికి అవి వెంచర్లని తెలుస్తుంది. లే అవుట్ లోనే రోడ్లు, క్లబ్ హౌజ్ లు, అనేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కనిపిస్తున్నది. హెచ్ఎండీఏ నిబంధనలకు దాదాపుగా సరిపోయే రీతిలో రోడ్లు, ఇతర సదుపాయాల కల్పన దర్శనమిస్తున్నది. కానీ అనుమతులకు వెళ్లకుండా ఆర్గానిక్ అగ్రికల్చర్, వీకెండ్ హోమ్స్ అనే పేర్లతో ప్లాట్ల అమ్మకాన్ని యధేచ్చగా సాగిస్తున్నది. క్లబ్ హౌజ్ లు, ఇతర అనేక నిర్మాణాలు కస్టమర్లకు ఫ్రీ అంటూ బ్రోచర్లలోనే ముద్రించారు. మరి వ్యవసాయ భూములైతే ఈ నిర్మాణాలకు అనుమతులు ఎవరిచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్లాట్ల కొనుగోలుదార్లంతా సేల్ డీడ్ లో కొన్న స్థలానికి దారి ఉన్నదో లేదో వెతుక్కుంటే కంపెనీ రహస్య ఎజెండా అర్ధమవుతుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నారు.

Read more:

Niharika Konidela : నిహారికతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు చైతన్య..!

Advertisement

Next Story