- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సన్Vs విన్..! ఎండ తీవ్రతతో ఓటింగ్ శాతం తగ్గే చాన్స్
దిశ, వరంగల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటోంది. ఈనెల 11న సాయంత్రం 5 గంటల వరకు లోక్‌సభ ఎన్నిలకు ప్రచార గడువు కాగా ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని ఉధృతం చేస్తున్న రాజకీయ పార్టీలు మరోవైపు పోలింగ్ మేనేజ్‌మెంట్‌కు కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా ఎండల తీవ్రత పెరగడంతో పోలింగ్ శాతంపై ప్రభావం ఉంటుందని పార్టీలు భావిస్తున్నాయి. వాస్తవానికి గత కొన్ని ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకర్గాల వారీగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గణనీయంగా పడిపోతూ వస్తోంది. పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటింగ్‌కు ప్రజల్లో అనాసక్తి, నిర్లక్ష్యమే కారణమవుతున్నాయి. ఈ పరిణామానికి ఈ సారి ఠారెత్తిస్తున్న ఎండలు తోడవుతుండటంతో పోలింగ్ శాతం మరింతగా పడిపోయే అవకాశం ఉంటుందన్న అంచనాలున్నాయి. పోలింగ్‌శాతం తక్కువగా నమోదైతే ఫలితాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. దీంతో రాజకీయ పార్టీలు బూత్ స్థాయిలో పోలింగ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి కేంద్రీకరించాయి.
పార్టీల సమాయత్తం..!
పోలింగ్ పర్సంటేజీ తగ్గే అవకాశాలున్నాయనే అంచనాలు తెరమీదకు వస్తుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మూడు ప్రధాన పార్టీలు అలర్ట్‌అయ్యాయి. బూత్ స్థాయి క్యాడర్‌ను, లీడర్లను పోలింగ్ రోజున ఓటర్లను కేంద్రాలకు తరలించేందుకు చేయాల్సిన పనులను వివరిస్తున్నాయి. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలించడమే బూత్‌ల వారీగా పార్టీ విజయానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వరంగల్, మానుకోట రెండు లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల్లో పోల్ మేనేజ్‌మెంట్ చాలా కీలకమని, బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధిష్టానాల సూచనలతో పార్టీల నేతలు అలర్ట్అయ్యారు. ఇప్పటి నుంచే ఆయా పార్టీల పెద్దల ఆదేశాలతో అభ్యర్థులు బూత్ స్థాయి కమిటీలపై దృష్టి సారించారు. గ్రామ స్థాయిలో ఉన్న లోకల్ లీడర్లను అలర్ట్ చేస్తున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి అనుసరించాల్సిన వ్యూహాలను విడమరిచి చెప్పేస్తుండటం గమనార్హం. బూత్ స్థాయి లీడర్ల పనితీరే అభ్యర్థుల విజయావకాశాల్లో కీలకం కానుందన్న విశ్లేషణ జరుగుతోంది.
బీఆర్ఎస్ వెనుకబాటు..!
పోల్ మేనేజ్‍మెంట్ సన్నద్ధతకు సంబంధించి వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందంజలో ఉండగా, బీఆర్ ఎస్ కొంత వైఫల్యం చెందుతున్నట్లుగా ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది కీలక నేతలు, ద్వితీయ, క్షేత్రస్థాయిలో లీడర్లు పార్టీని వీడటం కూడా దీనికి ఒక కారణమన్న విశ్లేషణ జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందన్న విశ్లేషణ జరుగుతుండగా, ఈ రెండు పార్టీలు పోలింగ్ మేనేజ్‌మెంట్‌పై కసరత్తును వేగిరం చేస్తుండటం గమనార్హం.
ఇప్పటికే ఈ రెండు పార్టీల నాయకత్వాలు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించాయి. గ్రామస్థాయి నాయకులను కూడా సిద్ధం చేశానయి. ఓటర్ల మొబిలైజేషన్‌తో పాటు ఓటర్లతో ఓటు వేయించే బాధ్యతను ఆయా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకు అప్పగించేయడం గమనార్హం. ఇక మానుకోట నియోజకవర్గ పరిధిలో బీఆర్ ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొనగా, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంగా కనిపిస్తోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉండడం ఆ పార్టీకి బాగా కలిసి రానుంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ క్యాడర్ చేజారుతోంది. ఇది ఆ పార్టీకి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. దీంతో పోలింగ్ మేనేజ్‌మెంట్ విషయంలోనూ అనుకున్న స్థాయిలో కసరత్తు ముందుకు సాగడం లేదన్న విశ్లేషణ జరుగుతోంది. ఇక బీజేపీ అనుకున్న స్థాయిలో ప్రచారంలో ముందుకు వెళ్లడం లేదని, క్యాడర్ కూడా తక్కువగా ఉండటం ఆ పార్టీకి మైనస్‌గా మారిందనే చెప్పాలి.