ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర చర్యలు : వీసీ సజ్జనార్

by M.Rajitha |
ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర చర్యలు : వీసీ సజ్జనార్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. త్వరలోనే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోతున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈవీ పాలసీ ప్రకారం పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులు వాడమని చెబుతోందని, ఆ ప్రకారమే డీజిల్, సిఎన్జీ గ్యాస్ బస్సుల సంఖ్య క్రమంగా తగ్గిస్తూ వాటిస్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకు వస్తున్నామని వెల్లడించారు. దీనిని కొంతమంది ఆర్టీసీని ప్రయివేట్ పరం చేస్తున్నారు, అందుకే బస్సుల సంఖ్య తగ్గిస్తున్నారంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సజ్జనార్ సామాజిక మాద్యమాల ద్వారా పేర్కొన్నారు. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహ అన్ని బస్సుల ఆపరేషన్ నిర్వహణ పూర్తిగా టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వివరణ ఇచ్చారు. ఆర్టీసీపై జరుగుతున్న సత్య ప్రచారాలను ఇకనైనా ఆపాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. 2023లో 550 ఎలక్ట్రిక్‌ బస్సులకు టెండర్లను ఆర్టీసీ సంస్థ పిలిచింది. అందులో 500 సిటీ బస్సులు, హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులున్నాయి. అందులో ప్రస్తుతం సిటీలో 74 ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తుండగా.. విజయవాడ మార్గంలో ఈ-గరుడ పేరుతో 10 బస్సులు తిరుగుతున్నాయి. దశలవారీగా ఈ ఎలక్ట్రిక్‌ బస్సులను సంస్థ అందుబాటులోకి తెస్తోంది.

Next Story

Most Viewed