మెదక్ ఆర్టినెన్స్ ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ ముప్పు.. అడ్డుకుంటామన్న బోయినపల్లి వినోద్ కుమార్

by Vinod kumar |   ( Updated:2023-04-18 14:26:05.0  )
మెదక్ ఆర్టినెన్స్ ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ ముప్పు.. అడ్డుకుంటామన్న బోయినపల్లి వినోద్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీకి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా సిక్ యూనిట్ గా చిత్రీకరించి మూసి వేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్(పీ.ఎస్.యూ) ప్రైవేటీకరణ కొనసాగుతోందని, చివరికి దేశరక్షణ శాఖకు కూడా ప్రైవేటీకరణ ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీ పరిరక్షణ జేఏసీ నాయకులు మంగళవారం ఆయనతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. లాభాల బాటలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నదని దుయ్యబట్టారు. మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో యుద్ద ట్యాంకర్స్, బుల్లెట్ ప్రూఫ్, ల్యాండ్ మైన్స్ ప్రూఫ్ వాహనాలు, లాంచర్స్ వంటి దేశ రక్షణ కోసం కీలక ఉత్పత్తులు తయారవుతాయని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా ముసుగులో పీఎస్యూ లను ప్రైవేట్ బాట పట్టిస్తున్న మోడీ వైఖరి ఏమాత్రం సరికాదన్నారు.

కేంద్రం తక్షణమే స్పందించి మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీకి వర్క్ ఆర్డర్ ఇవ్వాలని, ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్న సుమారు 3500 మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడటం మానుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మెదక్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీ జేఏసీ నాయకులు రమణా రెడ్డి, ప్రభు, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ గౌడ్, శివ కుమార్, రాజయ్య, యాదగిరి, అశోక్, మల్లికార్జున్ రెడ్డి, ప్రభు, శివ శంకర్ నాయక్, బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed