ప్రభుత్వ ఆలయాలపై ప్రత్యేక దృష్టి.. భక్తులతోపాటు పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళిక

by karthikeya |   ( Updated:2024-10-28 02:12:24.0  )
ప్రభుత్వ ఆలయాలపై ప్రత్యేక దృష్టి.. భక్తులతోపాటు పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలపై ప్రత్యేక దృష్టిసారించింది. దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలని, భక్తులతోపాటు పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతోంది. అయితే ప్రస్తుతం ఈఓల కొరత ఉంది. మొత్తం 704 ఆలయాలకు 233 మంది ఉండాల్సి ఉండగా కేవలం 164మంది మాత్రమే ఉన్నారు. అందులో గ్రేడ్-1 ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్స్ 39మందికి 34 మంది, గ్రేడ్ -2 ఆఫీసర్లు 67 మందికి 63 మంది, గ్రేడ్-3 ఆఫీసర్లు 127 మందికి 67 మందిమాత్రమే ఉన్నారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్లపై అదనపు భారం పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో అతిపురాతనమైన, మహిమాణిత్యం గల ఆలయాలు ఉన్నప్పటికీ వాటి ప్రాచుర్యం అంతగా చేయలేదు. దీంతో రాష్ట్రానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. గత ప్రభుత్వం యాదాద్రిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. మిగిలిన ఆలయాలపై కొంత పెండింగ్ పనులు మిగిలిఉన్నట్లు సమాచారం. వాటన్నింటిపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొండగట్టు, భద్రాద్రి, బాసర ఇలా మరికొన్ని ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అయితే ఈవోల కొరత కొంత అడ్డంకిగా మారుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వానికి ప్రతిపాదన

గత బీఆర్ఎస్ పాలనలోనే ఖాళీలకు సంబంధించిన ప్రతిపాదనలను దేవాదాయశాఖ నివేదించినట్లు అధికారులు తెలిపారు. ఏళ్లు గడిచాయి కానీ భర్తీ మాత్రం జరుగలేదు. మరోవైపు బదిలీలు చేపట్టినప్పటికీ అదనపు బాధ్యతలను సైతం అప్పగించినట్లు సమాచారం. దీంతో కొంతమంది ఈఓలు పనిఒత్తిడితో సతమతమవుతున్నట్లు తెలిసింది. మరోవైపు దేవాదాయశాఖ భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతోంది. భూముల సర్వే, సైన్ బోర్డులు, బౌండరీల ఏర్పాటు, ఎప్పటికప్పుడు ధరణి పోర్టల్ లో వివరాలను పొందుపర్చుతున్నారు.

లెక్కల్లో తేడాలు?

దేవాదాయశాఖలో ఎంత మంది పనిచేస్తున్నారు.. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలిపేలా అధికారుల్లో స్పష్టత కరువైందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి పంపిన లిస్టులో... సంబంధిత శాఖ మంత్రికి పంపిన ఖాళీల వివరాల్లో తేడాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. గతంలో ప్రభుత్వానికి ఇచ్చిన లిస్టునే మళ్లీ ఇచ్చారా? ఉద్యోగుల ప్రమోషన్లతో పోస్టులను తక్కువ, ఎక్కువ చూపారా? అసలు ఏంజరుగుతోందనే చర్చ ఆశాఖ సిబ్బంది, అధికారుల్లోనే జరుగుతోంది. ఏది ఏమైనా ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేస్తేనే లక్ష్యం నెరవేరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పటిలోగా భర్తీ చేస్తారు అనేది మాత్రం హాట్ టాఫిక్ గా మారింది. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రభుత్వం ఖాళీ పోస్టుల భర్తీపై కాలయాపన చేస్తుందా? నియమించి ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందా? అనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed