సర్కారీ జాగ కబ్జా.. సోలక్ పల్లిలో అక్రమార్కుల ఇష్టారాజ్యం

by Anjali |   ( Updated:2023-04-07 03:17:22.0  )
సర్కారీ జాగ కబ్జా.. సోలక్ పల్లిలో అక్రమార్కుల ఇష్టారాజ్యం
X

దిశ, సంగారెడ్డి బ్యూరో/ పటాన్ చెరు: ప్రభుత్వ భూముల కబ్జాల వ్యవహారం సర్వ సాధారణమైంది. పటాన్ చెరు ప్రాంతంలో నిర్మాణ రంగం భారీగా విస్తరిస్తుండడంతో ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. ఇన్ని రోజులు పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్ లకు పరిమితమైన భూ ఆక్రమణలు నియోజకవర్గంలోని మిగిలిన మండలాలకు విస్తరిస్తోంది. జిన్నారం, గుమ్మడిదకల్లో సైతం ఆక్రమణ పర్వం మొదలైంది. కన్ను పడిందంటే చాలు ప్రభుత్వ భూముల ఆక్రమణకు స్కెచ్ వేసి మాయం చేసేస్తున్నారు. ఈ ఆక్రమణలకు పెద్దల సహకారం ఉంటే చాలు మరింత సులువుగా తాము అనుకున్న కబ్జా పని పూర్తి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా జిన్నారం మండలం సోలక్ పల్లిలో రూ.కోట్లు విలువ చేసే ఆక్రమణ బాగోతం వెలుగులోకి వచ్చింది.

జిన్నారం మండలం సోలాక్ పల్లి లో సర్వే నెంబర్ 774 లో 17.26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి ధర ఎకరాకు రూ.కోట్లు పలుకుతుంది. అయితే ఈ భూమి పై కన్నేసిన కొందరు అనుకున్నదే తడవుగా భూ ఆక్రమణకు తెరలేపారు. సోలాక్ పల్లిలో అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి అనుకుని ఉన్న ప్రాంతంలో ఈ కబ్జా తతంగం జరుగుతుండటం గమనార్హం. దేవాలయానికి అనుకుని ఉన్న భూమి విలువైనది కావడంతో కొందరు ఈ భూమిలో పాగా వేయడానికి పథకం రచించారు. ఇంకేముంది రెండు రోజుల నుంచి జేసీబీ యంత్రాలు, టిప్పర్ల సహాయంతో ప్రభుత్వ భూమిని చదును చేయడం మొదలు పెట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా భూమిని చదును చేస్తూ మట్టితో నింపుతున్నారు.

* దర్జాగా ఆక్రమణ.. అధికారులెక్కడ?

అనంత పద్మనాభ దేవాలయాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంపై గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. విలువైన ప్రభుత్వ భూములను చదను చేస్తూ మాయం చేయడానికి ప్రయత్నిస్తుంటే అధికారులు ఎం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు కల్పించుకుని విలువైన భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

* విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం..

- తహశీల్దార్​ దశరథ్​సింగ్

సోలాక్ పల్లి లో సర్వే నెంబర్ 774 పూర్తిగా ప్రభుత్వ స్థలం. ఇక్కడ అనుమతి లేకుండా ఎటువంటి పనులు నిర్వహించడానికి వీలు లేదు. సదరు సర్వే నెంబర్ లో కొందరు భూమిని చదును చేసి ఆక్రమణకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందింది. వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తాం. ప్రభుత్వ భూముల్లో పనులు చేస్తున్నట్టయితే వెంటనే నిలిపేస్తాం. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల్ని అక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.

Advertisement

Next Story