రాష్ట్రానికి స్పెషల్ సీఎస్‌గా సోమేశ్? ఆ బాధ్యతలు అప్పగించే ఛాన్స్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-16 01:48:14.0  )
రాష్ట్రానికి స్పెషల్ సీఎస్‌గా సోమేశ్? ఆ బాధ్యతలు అప్పగించే ఛాన్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా దాదాపు మూడేళ్ల పాటు పనిచేసిన సీఎస్ సోమేశ్ కుమార్ తిరిగి రాష్ట్రానికి వస్తున్నారని తెలుస్తున్నది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ కేడర్‌గా వెళ్లిన ఆయన.. అక్కడి సీఎస్ జవహర్‌రెడ్డికి రిపోర్టు అందజేశారు. ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్‌తోనూ భేటీ అయ్యారు. ఏ బాధ్యతలు అప్పజెప్పినా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మీడియాకూ ఆయన స్పష్టం చేశారు.

కానీ అక్కడి ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఆ విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆమోదించింది. దీనికి సంబంధించిన ఫైల్‌ను ఢిల్లీలోని డీవోపీటీ (డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్) విభాగానికి పంపింది. ఒకటి రెండు రోజుల్లో అక్కడ కూడా ఆమోదం లభించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉన్నది.

డీవోపీటీ నుంచి అఫీషియల్ ఆర్డర్స్ వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వంలో స్పెషల్ సీఎస్‌గా ఆయన చేరబోతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ మేరకు రంగం సిద్ధమైంది. తెలంగాణ సీఎస్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఎక్సయిజ్, కమర్షియల్ టాక్సెస్ సెక్రటరీగానూ కొనసాగారు. త్వరలో తెలంగాణ స్పెషల్ సీఎస్‌గా పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా ఆ రెండు శాఖల బాధ్యతలను ఆయనే చూసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సీఎం కేసీఆర్ సైతం అందుకు సమ్మతించినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ శాఖల బాధ్యతలను సోమేశ్‌కు అప్పజెప్పే అవకాశాలున్నాయి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ శాఖల బాధ్యతలను ఇప్పటివరకు వేరే ఏ అధికారికీ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించలేదు. ఆ శాఖల మీద ఆయనకు అనుభవం ఉన్నందున సోమేశ్‌ను స్పెషల్ సీఎస్‌గా నియమించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది.

బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచే కార్యకలాపాలు..

ఇది ఎన్నికల ఏడాది కావడంతో పాటు బడ్జెట్ సైజు కూడా పెరిగింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ గతేడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకున్న విధంగా నిధులు అందుతాయని రాష్ట్ర సర్కారుకు నమ్మకం లేదు. దీంతో స్వీయ ఆర్థిక వనరులపైనే రాష్ట్రం ఆధారపడటం అనివార్యంగా మారింది.

ఈ టాస్క్‌లో సోమేశ్ కుమార్ తనదైన శైలితో సక్సెస్ అవుతారని, రాష్ట్రానికి వనరులు సమకూరుతాయనే నమ్మకంతో ఉన్నది ప్రభుత్వం. స్పెషల్ సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రస్తుతం సెక్రటేరియట్‌గా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచే కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం పదో అంతస్తులో ప్రత్యేకంగా ఛాంబర్ తయారవుతూ ఉన్నది. ఏపీ ప్రభుత్వానికి వీఆర్ఎస్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నా.. విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో బీఆర్‌కే భవన్‌లోని పదో అంతస్తులో జరుగుతున్న కొత్త చాంబర్ పనులు ఎవరికోసమనేది బయటకు రాలేదు.

ఇప్పటికే విధుల్లో పలువురు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు

ఐఏఎస్ అధికారులుగా పనిచేసినవారిని ఏదో ఒక పోస్టులో నియమించుకుంటున్న కేసీఆర్.. సోమేశ్ కుమార్‌కు సైతం అలాంటి చాన్స్ ఇవ్వాలనుకుంటునునట్టు తెలిసింది. గతంలో సీఎస్‌గా పనిచేసి రిటైర్ అయిన రాజీవ్‌శర్మను ముఖ్య సలహాదారుగా, ఎస్‌కే జోషిని సాగునీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించుకున్నారు. మరో రిటైర్డ్ అధికారి కేవీ రమణాచారిని సాంస్కృతిక సలహాదారుగా పెట్టుకున్నారు.

ఇక రిటైర్డ్ డీజీపీ అనురాగ్‌శర్మను, ఏకే ఖాన్‌ లాంటి పలువురిని కూడా అడ్వయిజర్లుగా నియమించుకున్నారు. వీరికి తోడు ఆర్థిక శాఖలో రిటైర్ అయిన శివశంకర్ (ఫైనాన్స్ డిపార్టుమెంటుల కన్సల్టెంట్), దేవాదాయ శాఖలో రిటైర్ అయిన అనిల్ కుమార్‌ను సివిల్ సప్లయ్స్ డిపార్టుమెంటులో కమిషనర్‌గా, జీఏడీలో రిటైర్ అయిన అర్వీందర్ సింగ్‌ను అదే శాఖలో ప్రోటోకాల్ అదనపు సెక్రటరీగా నియమించారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా నర్సింగ్ రావు (ఐఏఎస్ రిటైర్డ్), సెక్రటరీగా భూపాల్ రెడ్డి (ఐఎఫ్ఎస్ రిటైర్డ్) కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ వరుసలో సోమేశ్ కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చేరనున్నారు. డీవోపీటీ నుంచి వీఆర్ఎస్ విజ్ఞప్తిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు రాకపోవడంతో.. ఆయన తెలంగాణలో స్పెషల్ సీఎస్‌గా చేరడంపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఢిల్లీ నుంచి డీవోపీటీ ఉత్తర్వులు వెలువడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఆయన నియామకానికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యే చాన్స్ ఉన్నది. రిటైర్‌మెంట్ వరకూ తెలంగాణ కేడర్‌గా కొనసాగాలని ఆయనతో పాటు ప్రభుత్వమూ కోరుకున్నది. కానీ గతంలోని క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఏపీ కేడర్‌గా వెళ్లక తప్పలేదు.

ఇక డీవోపీటీ నుంచి వెలువడే ఉత్తర్వుల కోసమే ఇటు సోమేశ్ కుమార్‌తో పాటు అటు తెలంగాణ ప్రభుత్వం వెయిట్ చేస్తున్నది. ఉత్తర్వులు రావడంతోనే ఆయనను స్పెషల్ సీఎస్‌గా నియమించుకోవాలని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నది. అపాయింట్‌మెంట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన మరోసారి చక్రం తిప్పుతారన్న చర్చలూ ఐఏఎస్ అధికారుల మధ్యలో స్వల్ప స్థాయిలో మొదలయ్యాయి.

Advertisement

Next Story