స్మగ్లింగ్ గ్యాంగ్స్ @ హైదరాబాద్.. గతేడాది నమోదైన డ్రగ్స్ కేసులెన్నో తెలుసా?

by Sathputhe Rajesh |
స్మగ్లింగ్ గ్యాంగ్స్ @ హైదరాబాద్.. గతేడాది నమోదైన డ్రగ్స్ కేసులెన్నో తెలుసా?
X

స్మగ్లింగ్ గ్యాంగ్స్‌కు హైదరాబాద్ సెంటర్ పాయింట్‌గా మారింది. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలను దిగుమతి చేసుకుంటున్న పలువురు.. వివిధ మార్గాల ద్వారా విదేశాలకు పంపుతున్నారు. పోలీసులు దాడులు నిర్వహించి, అరెస్టులు చేస్తున్నా ఈ దందా ఆగడం లేదు. అంతేకాకుండా లోకల్‌గానూ యువతను మత్తుకు బానిసలను చేస్తున్నారు. ఫుల్ డిమాండ్ క్రియేట్ చేసి.. సప్లయ్ చేస్తున్నారు.

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఆశతో చాలా మంది డ్రగ్స్ దందాలో ఎంట్రీ అవుతున్నారు. స్మగ్లింగ్ గ్యాంగ్స్‌లో చేరిపోయి, వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్‌ను ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. చాలా మంది హైదరాబాద్‌ను అడ్డాగా మార్చుకుంటున్నారు.

విదేశాల నుంచి సముద్ర, ఇతర మార్గాల ద్వారా దేశంలోకి వస్తున్న డ్రగ్స్‌ను మెల్లమెల్లగా భాగ్యనగరానికి చేరుస్తున్నారు. ఇక్కడి నుంచి పార్సిళ్ల ద్వారా విదేశాలకు పంపిస్తున్నారు. దీని కోసం పక్కాగా నెట్వర్క్‌ను ఏర్పాటు చేసుకొని పని కానిచ్చేస్తున్నారు.

ఈ దందాను అరికట్టడానికి అధికార యంత్రాంగాలు ప్రయత్నిస్తున్నా.. ఫలితం కనిపించటం లేదు. రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం, కొంతమంది అధికారులు వీరికి సహకరిస్తుండడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

అనేక ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి..

మన దేశంలోకి 70 శాతానికి పైగా మాదకద్రవ్యాలు సముద్ర మార్గాల ద్వారా వస్తున్నట్లు ఎన్సీబీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అరేబియా, హిందూ మహా సముద్ర తీరాల్లోని ముంబై, ముంద్రా, కాండియా, నవ్‌షేవా, కొచ్చి, మోర్మూగావ్, పాండిచ్చేరి, కోల్‌కతా, చెన్నై, వైజాగ్ పోర్టుల ద్వారా మత్తు పదార్థాలు ఇంపోర్ట్ అవుతున్నాయి.

ముఖ్యంగా ఆఫ్రికన్, సౌత్ అమెరికా దేశాల నుంచి కొకైన్, హెరాయిన్, ఓపీఎం, ఎండీఎంఏ, హషీష్ వంటి డ్రగ్స్ ను దుస్తులు, పుస్తకాలు, చిన్న పిల్లల ఆటసామాగ్రి, కాస్మోటిక్స్ ఇలా పలురకాల వస్తువుల బాక్సుల్లో చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి తీసుకొస్తున్నారు.

అంతేకాకుండా పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల నుంచి డ్రగ్స్ మనదేశంలోకి వస్తున్నది. దేశంలోకి వచ్చిన మత్తు పదార్థాలను చాలా గ్యాంగులు హైదరాబాద్‌కు తీసుకొస్తున్నాయి. లోకల్‌గా సప్లయ్ చేయడంతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాలకు సైతం సప్లయ్ చేస్తున్నాయి. ఇటీవల పోలీసులకు దొరికిన డ్రగ్స్ ఘటనలే ఇందుకు నిదర్శనం.

పార్సిళ్ల ద్వారా..

కరోనా నుంచి స్మగ్లింగ్ గ్యాంగ్స్ రూటు మార్చాయి. పార్సిళ్ల ద్వారా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాయి. మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఫరీద్, ఫైజాన్ అనే ఇద్దరు యువకులు సూడో ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్ ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి పుస్తకాలు, దుస్తుల మధ్యలో పెట్టారు. హైదరాబాద్‌లోని జీవీఆర్ ఇంటర్నేషనల్ కొరియర్స్, పూణెలోని ఇండోఫైన్ కొరియర్ నుంచి ఆస్త్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు చాలాసార్లు పంపించారు. పక్కా సమాచారంతో ఇటీవల రాచకొండ ఎస్ఓటీ అధికారులు వీరిని అరెస్ట్ చేశారు. ఏడాదిలోనే ఇలా 40 కిలోలకు పైగా డ్రగ్స్‌ను విదేశాలకు తరలించినట్టు గుర్తించారు. హైదరాబాద్‌కు వచ్చి విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేసే ఇంకా చాలా గ్యాంగ్స్ ఉన్నట్లు తెలుస్తున్నది.

క్రియేట్ డిమాండ్.. అండ్ సప్లయ్..

భాగ్యనగర్‌లోను డ్రగ్స్‌కు వివిధ గ్యాంగ్స్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇందుకు యువతను లక్ష్యంగా చేసుకొని వారిని మత్తుకు బానిసను చేస్తున్నాయి. బడా వ్యాపారుల పిల్లలు, సినీరంగ ప్రముఖులు, విద్యార్థులను ఉచ్చులోకి లాగుతున్నాయి. క్లబ్బులు, పబ్బులు, ఫాం హౌజులు ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వారికి అడ్డాలుగా మారుతున్నాయి. మత్తు పదార్థాలు కొనటానికి డబ్బుల కోసం తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని హత్యలు చేస్తున్న ఘటనలు సైతం వెలుగుచూస్తున్నాయి.

దేశంలో, రాష్ట్రంలో నమోదైన డ్రగ్స్ సంబంధిత కేసులు

ఏడాది.. దేశంలో.. తెలంగాణలో

2021 2,40,937 5,347

2022 2,87,669 6,012

రెండేళ్లలో తెలంగాణలో నమోదైన కేసుల్లో 23 వేల కిలోలకు పైగా గంజాయి, అయిదు కిలోలకు పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు హషీష్, కొకైన్, ఓపీఎం, సూడో ఎఫిడ్రిన్, చరస్, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, ఓపీఎం వంటి మత్తు పదార్థాలను సైతం పోలీసులు సీజ్ చేశారు.

Advertisement

Next Story