T-బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టుకు షార్ట్ లిస్ట్.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌!

by Sathputhe Rajesh |
T-బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టుకు షార్ట్ లిస్ట్.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ రథసారథి ఎవరో అనే అంశానికి త్వరలోనే చెక్ పడనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. షార్ట్ లిస్ట్ సైతం సిద్ధం చేసినట్లుగా పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఈ అంశంపై దూకుడు పెంచినట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రక్రియను స్పీడప్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియ దాదాపు తుది దశకు రావడంతో శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఎవరిని ఫైనల్ చేస్తారోనని ఉత్కంఠగా మారింది.

లోకల్ బాడీ ఎలక్షన్స్ నేపథ్యంలో..

రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కమలదళపతి నియామకంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పోటీ చేసి సగం మేర సీట్లు సాధిస్తేనే తెలంగాణలో వచ్చేసారి అధికారం సాధ్యమని కమలనాథులు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ నాయకులను గెలిపించుకుంటామని ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనూ బీజేపీ ఎంపీలు శపథం చేశారు. మరి దానికి ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారనేది సస్పెన్స్ గా మారింది.

తీవ్ర పోటీ

స్టేట్ చీఫ్ పోస్టు కోసం బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, కల్వకుర్తి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆచారి అధిష్టానం ఎదుట విన్నవించుకున్నారు. కానీ ఇందులో ఎవరిని ఫిక్స్ చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ఇంతమందిలో హైకమాండ్ పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిసింది. దీనిపై అభిప్రాయ సేకరణ కూడా పూర్తిచేసినట్లు సమాచారం.

ఇద్దరి పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఉన్న పేర్లు ఎవరివనేది సస్పెన్స్‌గా మారింది. పార్టీ ఎవరిని ప్రకటిస్తుందా అనే ఉత్కంఠతో శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. అయితే ప్రెసిడెంట్ నియామకంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జాతీయ అధ్యక్షుడి ప్రకటన తర్వాత ఉండే అవకాశం ఉందని పలువురు చెబుతుండగా. నవంబర్ తర్వాతే అని పలువురు చెబుతున్నారు. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.

Advertisement

Next Story