ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

by samatah |   ( Updated:2022-12-03 15:49:02.0  )
ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి పెంచుతూ శుక్రవారం అసెంబ్లీ ఏకగ్రీవంగా రెండు బిల్లులకు ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లుల ప్రకారం షెడ్యుల్ తెగలకు 32 శాతం ఇతర వెనుకబడిన కులాలకు 27 శాతం, షెడ్యూల్ కులాలకు 13 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాకు మరో 4 శాతం రిజర్వేషన్ కోటా కేటాయించారు. అయితే పెద్ద ఎత్తున రిజర్వేషన్ల కోటా పెంచడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా అసెంబ్లీ ఆమోదించిన సవరణ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యుల్ లో చేర్చాలని స్పీకర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది.

సీఎం భూపేష్ బఘేల్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్ తో పాటు రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మరో వైపు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై రకరకాల విమర్శలు మిగతా సామాజిక వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు బీజేపీతో పాటు తమ ప్రత్యర్థులైన ఇతర ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ తాజా నిర్ణయాన్ని సామాజిక-రాజకీయ ఎత్తుగడగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయం ఆ పార్టీని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో, మిగతా రాష్ట్రాల్లో ఏ మేరకు కలిసి వచ్చేలా చేస్తుందో చూడాలి మరి. ఈడబ్ల్యూఎస్ కోటా విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై తాజాగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జనాభా దామాషా ప్రకారం బీసీల రిజ ర్వేషన్లను 27శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, అవసరం అయితే 50 శాతం ఉన్న సీల్ ను బ్రేక్ చేయాలనే డిమాండ్లు తెలంగాణలో వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగున ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story